రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ఎరువుల డిమాండ్ కూడా పెరిగిందని... డిమాండ్‌కు తగినట్లుగా ఎరువులను అందుబాటులో ఉంచాలని సీఎం మంత్రులను, అధికారులను ఆదేశించారు. వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉందని.. ఫలితంగా ఎరువుల వాడకం కూడా పెరుగుతుందన్నారు. గతేడాది ఆగస్టు 14 నాటికి 8,06,467 టన్నుల ఎరువుల వినియోగం జరగిందన్నారు.
రేపు దిల్లీకి మంత్రి నిరంజన్‌రెడ్డి
ఈ ఏడాది ఆగస్టు 14 నాటికి 15,88,788 టన్నుల ఎరువులు తీసుకున్నారని తెలిపారు. గతేడాది వానాకాలం సీజన్‌లో మొత్తం 14.48 లక్షల టన్నుల ఎరువులు వినియోగించారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది 22.30 లక్షల టన్నులు వినియోగం అవుతాయని అంచనా వేశారు. వర్షాలు, కరోనా, ఇతర సమస్యలతో ఎరువులు సకాలంలో అందట్లేదన్నారు. పరిస్థితిని వివరించి ఎక్కువ ఎరువులు కేటాయించాలని... కేటాయించిన ఎరువులను త్వరగా పంపాలని కేంద్రాన్ని కోరాలని మంత్రి నిరంజన్‌రెడ్డి, అధికారులకు సూచించారు. వ్యవసాయశాఖ మంత్రి, అధికారులు దిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడాలన్నారు. సీఎం ఆదేశాలతో రేపు మంత్రి నిరంజన్‌రెడ్డి, అధికారులు దిల్లీ వెళ్లనున్నారు.
ఇవీ చూడండి: సెప్టెంబరు 7 నుంచి శాసనసభ సమావేశాలు