కొత్తగా నిర్మించే సచివాలయ భవన సముదాయం రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింప చేసే విధంగా రూపొందించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలన్నారు. నూతన భవన సముదాయం రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు.
నూతన సచివాలయ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. నూతన భవనంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు తమ విధులు నిర్వర్తించేలా ఉండాలని కేసీఆర్ తెలిపారు. గతంలో మాదిరిగా విడివిడిగా విసిరేసినట్లు ఉండొద్దని సూచించారు.
సచివాలయ సమీపంలోనే అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల సముదాయాన్ని కూడా నిర్మిస్తామని సీఎం వెల్లడించారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఒకే దగ్గర ఉంటుందని వివరించారు. సచివాలయ బాహ్య రూపం ఎంత హుందాగా, గొప్పగా ఉంటుందో లోపల కూడా అంత సౌకర్యవంతంగా.. అన్ని వసతులతో ఉండాలని స్పష్టం చేశారు.
మంత్రులు, కార్యదర్శుల ఛాంబర్లు, సమావేశ మందిరాలు, సిబ్బంది కార్యాలయాలు, లంచ్ హాల్స్, సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్, రికార్డు రూములు తదితరాలు ఎలా ఉండాలో నిర్ణయించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సచివాలయ స్థలంలోనే ప్రార్థనా మందిరాలు, బ్యాంకు, క్రష్, విజిటర్స్ రూమ్, పార్కింగ్, భద్రతా సిబ్బంది నిలయం తదితర ఏర్పాట్లు ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించాలన్నారు. సౌకర్యాలు, సదుపాయాలు ఎలా ఉండాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకుని టెండర్లు పిలవాలని కేసీఆర్ సూచించారు.