గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. పల్లెప్రగతితో పరుగులు పెడుతున్న గ్రామాల అభివృద్దికి ఊతం ఇస్తూ.. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం మరిన్ని నిధులు విడుదల చేశారు. స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసి, గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా.. నిధుల విడుదల
పల్లెప్రగతి కార్యక్రమం కింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి మొదటి విడతగా రూ.273 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అందులో గ్రామ పంచాయతీలకు రూ.232.06 కోట్లు, మండల ప్రజా పరిషత్‌లకు రూ.27.28 కోట్లు, జిల్లా ప్రజా పరిషత్‌లకు రూ.13.65 కోట్లు విడుదల చేస్తూ... ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ... రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటి వరకు రూ.6,034 కోట్లు విడుదల
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి అమలు చేయడానికి ప్రతినెలా రూ.308 కోట్లలను గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.5,761 కోట్లు విడుదల చేసి పనులు చేపట్టారు. ఇప్పుడు మరో రూ.273 కోట్ల అభివృద్ది కార్యక్రమాలను గ్రామాల్లో అమలు చేయనున్నారు. అలా ఇప్పటి వరకు రూ.6,034 కోట్లు విడుదల చేసి గ్రామాలను అభివృద్ది పథంలో నడిపిస్తున్నామని మంత్రి తెలిపారు.
ప్రణాళికాబద్దంగా గ్రామాల్లో అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలన్న సంకల్పంతో అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలు అవుతున్నాయన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాలలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మంత్రి వివరించారు. పల్లెల ప్రగతితో బంగారు తెలంగాణ రాష్ట్రం నిర్మాణం సాకారం కాబోతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం