Pragathi bhavan ugadi celebrations: హైదరాబాద్ ప్రగతి భవన్ జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం అందించారు. బాచంపల్లి సంతోశ్‌కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం వినిపించారు. యాదాద్రి పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. శుభకృత్ సంవత్సరం అందరికీ శుభాలు కలిగిస్తుందన్న పంచాంగకర్త.. ఈసారి సకాలంలోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని పంటలు బాగా పండుతాయని వివరించారు.
ముఖ్యమంత్రి పాలనలో కాళేశ్వరం ఫలాల వల్ల ఎక్కడ చూసినా నీటసవ్వడులే ఉన్నాయని పంచాంగకర్త హర్షం వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాలు సానుకూలం, పాడిపంటలు, విద్యారంగంలో చాలా మార్పులు పట్టాలెక్కబోతోందన్నారు. ఈ సంవత్సరం సంస్కరణలకు పెద్దపీట, సాఫ్ట్‌వేర్ రంగంలో అద్భుతాలు.. వర్క్‌ఫ్రమ్ హోంకు ఇక స్వస్తి పలుకుతారని వివరించారు. ఈ ఏడాది తుఫానులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలనిబాచంపల్లి సంతోశ్‌కుమార్ శాస్త్రి సూచించారు. కొన్ని జాగ్రత్తలతో పంటలు వేస్తే డబ్బుల సంచులతో ఇంటికి వెళ్తారని చెప్పారు. ఇక నుంచి మాస్కులకు సెలవు పలకాలని.. కరోనా పరీక్షలు అవసరం లేదని తెలిపారు. ఈ సంవత్సరం ఆనందంగా ఉండబోతోందని అన్నారు. అద్భుతమైన పంటలు పండి, అద్భుతమైన పాలనతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతోందని తెలిపారు. రాష్ట్రంలో యజ్ఞయాగాది క్రతువులు ఈ ఏడాది జరుగుతాయని.. శిశుసంక్షేమం బాగుంటుందని పేర్కొన్నారు.
"మందీ మార్భలం, వాగ్ధాటి కలిగిన వ్యక్తులదే ఈ ఏడాది. సరిహద్దులో కొంత ఉద్రిక్తతలు పెరుగుతాయి. రాజకీయంగా చాలా మార్పులు జరగనున్నాయి. ఎవరు ఎక్కడ ఉంటారో చాలా సందేహంగా ఉంటుంది. పార్టీలు మారాలనుకునే వారికి గడ్డుకాలం తప్పదు. కర్కాటక రాశి ముఖ్యమంత్రిది. గతేడాది కంటే బాగుంటది. అనుకూల సమయం ప్రారంభమైంది. ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా సరైన పద్ధతిలో ముందుకు వెళ్తారు. వేములవాడ రాజరాజేశ్వరుడి కృపతో పాటు యాదగిరి లక్ష్మీనరసింహుడి చల్లని చూపు. చంద్రశేఖరుడి ముఖారవిందం నుంచి సాహసోపేతమైన నిర్ణయాలు వెలువడతాయి."
- బాచంపల్లి సంతోశ్‌కుమార్ శాస్త్రి, పంచాంగకర్త
మహిళలు మెరుగైన ఫలితాలు సాధిస్తారు: తెలంగాణలో నిరుద్యోగ కలలు తీరబోతున్నాయని.. ఉద్యోగ నామ సంవత్సరంగా నిలిచిపోతుందని బాచంపల్లి సంతోశ్‌కుమార్ శాస్త్రి అన్నారు. శుభకృత్ నామ సంవత్సరంలో స్త్రీలకు బుధుడు అధిపతి.. మహిళలు మేలైన ఫలితాలు అందుకుంటారని తెలిపారు. దేశంలో అత్యున్నత పదవి మహిళకు దక్కే అవకాశం ఉందన్నారు. శుభకృత్ నామ సంవత్సరం మహిళా నామ సంవత్సరంగా నిలవనుందని సంతోశ్‌కుమార్ పేర్కొన్నారు. ఇంటాబయటా మహిళా అధికారులకు అద్భుతమైన ఫలితాలు దక్కనున్నట్లు పంచాంగంలో వివరించారు. ఏప్రిల్, మేలో ముఖ్యనేతలు, అధికారులకు భద్రత పెంపొందించుకోవాలని సూచించారు. పాకిస్థాన్‌తో దౌత్యపరమైన యుద్ధవాతావరణం ఉంటుందని.. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లోనూ ముఖ్యనేతలకు భద్రత పెంచాల్సి వస్తుందని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్‌లోనే అద్భుతంగా ఉంటుందన్నారు. భారతదేశం దృష్టి హైదరాబాద్‌పైనే ఉంటుందని.. ప్రపంచాన్ని శాసించేలా నగరం ఎదుగుతుందని చెప్పారు. మీడియా మిత్రులకు నిండుగా వార్తలు దొరుకుతాయన్న బాచంపల్లి సంతోశ్‌కుమార్ శాస్త్రి.. ప్రాణహితకు పుష్కరాలు రానున్నాయని.. ప్రజలంతా పొదుపు పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి : 'ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక'