CM KCR MahaShivratri Wishes: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, జాగరణ, పూజలు, అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని తెలిపారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని సీఎం కోరారు. మహాశివుని కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా, హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
MahaShivratri 2023: మరోవైపు రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలు భక్త జనసంద్రంగా మారాయి. మెదక్ జిల్లా ఏడుపాయలలో శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. హనుమకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పిల్లాపాపలతో కలిసివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో రాత్రి 8 గంటలకు నంది వాహన సేవ అనంతరం స్వామివారి కల్యాణం.. రాత్రి 11 గంటలకు రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
రామప్ప ఆలయంలో చిరంజీవి కూతురు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూతురు శ్రీజ రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దక్షిణ కాశీగా పేరొందిన ఖమ్మం జిల్లా మధిర శివాలయం భక్తులతో నిండిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకొని వైరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మహాశివుడికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
ఇవీ చూడండి..
దేశంలోనే ఎత్తైన 10 శివుడి విగ్రహాలు ఇవే.. ఒక్కటైనా చూశారా..?