CM KCR letter to PM Modi: ఎరువుల ధరలు పెంచాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధాని మోదీకి లేఖ రాశారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి.. ఇప్పుడు వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమన్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్రం నిర్ణయం ఉందని ఆక్షేపించారు. ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్రం ఎరువుల ధరలను పెంచిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు భాజపా చేస్తున్న కుట్రలను దేశ ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంపై నాగళ్లు ఎత్తి తిరగబడితేనే వ్యవసాయాన్ని కాపాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
నాగళ్లు ఎత్తి తిరగబడితేనే..
"రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో భాజపా చెప్పింది. రైతుల ఆదాయం పెరిగేలా ఇప్పటికీ ముందడుగు పడలేదు. ఐదేళ్లలో పంట పెట్టుబడులు మాత్రం రెట్టింపయ్యాయి. రైతుల ఆదాయం మాత్రం తగ్గిపోయింది. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేదిశగా కేంద్రం నిర్ణయం. కేంద్రం ఎరువుల ధరలు పెంచి... అన్నదాతల నడ్డి విరిచింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం ఊదరగొట్టింది. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గం. కేంద్రంలోని భాజపా పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం. దేశంలో అన్నదాతలను బతకనిచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయ పంపు సెట్లకు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయట్లేదు. ఎరువుల ధరలను విపరీతంగా పెంచారు. పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలు తీసుకుంటున్నారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర చేస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయి. గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. భాజపాని కూకటివేళ్లతో పెకలించి వేయాలి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల రాయితీ ఎత్తేశారు. రైతులు వ్యవసాయం చేయకుండా కేంద్రం కుట్రలు చేస్తోంది. నాగళ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకోలేం. కేంద్రాన్ని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలి. ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. కేంద్రంపై పోరాటానికి రాష్ట్ర రైతులంతా కలిసిరావాలి." - కేసీఆర్, సీఎం
ఇదీ చూడండి: