CM KCR Laid Foundation for Hyderabad NIMS New Block : పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సర్కారు నిమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఇప్పటికే దాదాపు 30కి పైగా విభాగాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న నిమ్స్... అదనంగా మరో 2వేల పడకల నూతన బ్లాక్ నిర్మాణానికి పునాదిరాయిపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గర్బిణులు, బాలింత కోసం ఉద్దేశించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీని సీఎం ప్రారంభించారు. ఆరుగురు గర్భిణీలకు సీఎం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ అందించారు.
Foundation Stone for NIMS Expansion Works : ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో 1800 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులో ఉండగా నిత్యం ఆస్పత్రి రోగులతో కిక్కిరిస్తున్న పరిస్థితి. దీనికి తోడు అన్ని రకాల వైద్య సేవలు అందుతున్న నిమ్స్‌లో మాతాశిశు వైద్యం అందుబాటులో ఉంటే మంచిదని భావించిన సర్కారు.... ఇటీవలే నిమ్స్ ప్రాంగణంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ బ్లాక్‌కి సైతం శంకుస్థాపన చేసింది. ఇక దశాబ్ది ఉత్సవాల వేళ 15 వందల71 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో నూతన బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నిర్మాణ బాధ్యతలను ఆర్‌ఎండ్‌బీ శాఖకు అప్పగించింది. ఈ నూతన భవన సముదాయంలో మొత్తం 4 బ్లాక్ లను అందుబాటులోకి తేనున్నారు. అందులో ఓపీ సేవల కోసం ఒక బ్లాక్, ఐపీ సేవల కోసం రెండు బ్లాక్‌లు, ఎమర్జెన్సీ సేవల కోసం మరో బ్లాక్ అందుబాటులో ఉంచనున్నారు.
రూ. 1571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త బ్లాక్ నిర్మాణం : 120 ఓపీ గదులు, సహా 1200 ఆక్సిజన్ బెడ్‌లు, 500 ఐసీయూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 38 విభాగాలకు సంబంధించిన సేవలను ఇక్కడ అందించనుండగా... అందుకోసం 32 మాడ్యులార్ ఆపరేషన్ థియేటర్‌లు, 6 మేజర్ మాడ్యులార్ థియేటర్‌లు సిద్ధం చేయనున్నారు. నూతన భవన సముదాయంలో అందుబాటులోకి వచ్చే పడకలతో కలిపి నిమ్స్‌లో బెడ్స్ సంఖ్య 4వేలకి చేరనుంది. 32 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి 571 కోట్లతో నిర్మించనున్న ఈ నూతన భవన సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఇప్పటికే 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు అవుతోంది. తాజాగా మిగిలిన 24 జిల్లాల్లో రేపట్నుంచి న్యూట్రిషన్ కిట్ల పంపిణీ జరగనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 6.8 లక్షల మంది గర్భిణీలకు ప్రయోజనం చేకూరనుంది. న్యూట్రిషన్ కిట్ల కోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. నిమ్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు హరిశ్ రావు, తలసాని, సీఎస్ శాంతి కుమారి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: