CM KCR inspects New Secretariat Works: సచివాలయ నిర్మాణ పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. సచివాలయ ప్రాంగణంలో రెండు గంటలకు పైగా కేసీఆర్... పనుల గురించి ఇంజినీర్లను, అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఇంటీరియర్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల మేర భవనాన్ని నిర్మిస్తున్నారు.
సచివాలయ నిర్మాణ కోసం సిబ్బంది, కార్మికులు... మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సుధీర్ఘకాలం రాష్ట్ర అవసరాలకు పనికొచ్చే విధంగా పటిష్ఠంగా నిర్మాణం చేస్తున్నారు. చాంబర్లు, ఇంటీరియర్ డిజైన్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కలరింగ్, ఫ్లోరింగ్, మార్బుల్స్, పోర్టికోల నిర్మాణం ఏకకాలంలో చేపడుతున్నారు. గ్రీన్ బిల్డింగ్ పద్ధతిలో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టారు. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. భవనం లోపల కలియతిరిగిన సీఎం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు, ఇంజినీర్లకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. అనంతరం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి అక్కడ నుంచి బయల్దేరి వెళ్లారు.
Telangana New Secretariat Inauguration : కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవన ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా... వచ్చే నెల 17న అట్టహాసంగా జరగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్య వేద పండితుల సమక్షంలో సచివాలయ ప్రారంభోత్సవ క్రతువు నిర్వహించనున్నారు. వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం నిర్వహిస్తారని... రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖంఢ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడియూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బిఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ పాల్గొంటారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత... సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి: