గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అడ్డుపడిన కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. మొదట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు మాత్రమే ప్రస్తావించినా.. ఆ తర్వాత ఆరుగురు సభ్యులపైనా వేటు వేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసత్యపు ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని... ఆయన విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఓ రకంగా చెప్పాలంటే రాజకీయంగా సంచలన నిర్ణయాన్ని తీసుకునే కోణంలోనే కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. మిషన్ భగీరథ నీటి విషయంలో రాజగోపాల్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా అసత్యాలు చెప్పారంటూ కేసీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారికి సభలో ఉండే అర్హత ఉందో లేదో తేల్చాలని సభాపతిని కోరారు.
బహిష్కరణ వేటు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని సభాపతిని ముఖ్యమంత్రి కోరారు. ఈ విషయంలో తమ హక్కులను కాపాడాలన్న సీఎం... ఇష్టారీతిన మాట్లాడే వారిని ఉపేక్షించవద్దని కోరారు. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై గతంలో బహిష్కరణ వేటు అంశాన్ని కూడా ప్రస్తావించారు. మరోవైపు మునుగోడులో ఉపఎన్నిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చూడండి: అసెంబ్లీలో నమస్కారం 'కరో'నా అంటున్న నేతలు