CM KCR comments on Budget : కేంద్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, రైతులు, సామాన్యులు, పేదలు, వృత్తి కులాలు, ఉద్యోగులందరినీ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని సీఎం ఆరోపించారు. భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను దశదిశా నిర్దేశంలేని... పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్‌గా కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
వ్యవసాయానికి బిగ్ జీరో బడ్జెట్
'కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనం, మాటల గారడీతో కూడికొని ఉంది. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలను తామే చరుచుకుంటూ... సామాన్యులను నిరాశ నిస్పృహలకు గురిచేసింది. మసిపూసి మారేడు కాయ చేసిన గోల్‌మాల్ బడ్జెట్. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యం... దేశ రైతులు, వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్‌ను బిగ్ జీరో' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందని ధ్వజమెత్తారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు.
ఆశలపై నీళ్లు
ఉద్యోగులు, చిరువ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని కేసీఆర్ అన్నారు. ఆదాయపన్నులో స్లాబ్స్‌ను మార్చకపోవడం విచారకరమన్నారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూసిన ఉద్యోగ వర్గాలు, పన్ను చెల్లింపుదారుల కేంద్ర బడ్జెట్ నీరు చల్లిందని చెప్పారు.
ప్రజల ఆరోగ్యం పట్టదా?
వైద్యం, ప్రజారోగ్యం, మౌలిక రంగాలను అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేటతెల్లమైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కష్టకాలంలో వైద్యరంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంటే.. ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమని విమర్శించారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధికి చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల పురోగతికి చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని కేసీఆర్ విమర్శించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 'ఇక దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్!'