రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, లాక్డౌన్ పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి పరిస్థితులు తెలుసుకున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష కూడా నిర్వహించారు. జిల్లాల వారీగా కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ అమలు తీరుపై ఆరా తీశారు. లాక్‌డౌన్‌కు మద్దతుగా గ్రామాల్లో కంచెలు, అడ్డుగోడలు కట్టడంపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ సహా కొన్ని పట్టణాల్లో ప్రజలు బయటకు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
శుక్రవారం నుంచి బియ్యం పంపిణీ
గ్రామాల్లో వ్యవసాయ పనులతో పాటు గుంపులు లేకుండా నీటిపారుదల, ఉపాధి హామీ పనులు చేపట్టవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెంచి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా జైలు పాలవుతారని హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... పండించిన పంట ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డుదారులకు శుక్రవారం నుంచి బియ్యం పంపిణీ చేస్తామన్నారు. 1500 రూపాయల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.
ప్రజాప్రతినిధులు స్పందించాలి
ప్రజల ఆరోగ్యాన్ని దృష్ట్యా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అలక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదన్న ఆయన కఠిన నిర్ణయాల వల్లే రష్యాలో ఇబ్బందులు తలెత్తలేదని గుర్తు చేశారు. అందరి మంచి కోసం ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలని, కొన్ని రోజులు ఓపిక పడితేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాన్నారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజాప్రతినిధులు స్పందించక పోవడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు వార్డు కమిటీలు, స్థాయీ సంఘాల సభ్యులు ప్రజల్లో అవగాహన పెంచి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చూడాలన్నారు.
100కు ఫోన్ చేయండి
అనారోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని... అవసరమైతే పోలీసులే వాహనాలు సమకూరుస్తామని సూచించారు. ఆపత్కాలంలో అద్భుత సేవలందిస్తున్నారంటూ వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులను అభినందించారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మీడియాకు మినహాయింపు ఉన్నందున ఇబ్బంది పెట్టొద్దని పోలీసులకు స్పష్టం చేశారు. కవులు రచయితలు కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేలా కవితలు రాయాలని కోరారు.