ఏపీలోని కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రెండో రోజు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.459.29 కోట్లతో చేపట్టే పనులకు మహావీర్ సర్కిల్‌లో శిలాఫలకాలను ఆవిష్కరించారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో రూ.5.5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
త్వరలోనే పనులు పూర్తి..
రూ.80 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్-రిమ్స్ రోడ్డును ప్రారంభిన జగన్.. రూ.107 కోట్లతో నిర్మిస్తోన్న డా. వైఎస్‌ఆర్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పనులను వేగవంతం చేసి, త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. డా. వైఎస్‌ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్‌కు టెండర్లు పూర్తైనట్లు వెల్లడించారు. బుగ్గవంక పెండింగ్ పనులకు రూ.50 కోట్లు కేటాయించారు.
రుణం తీర్చుకోలేను...
కడపలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన సీఎం జగన్... కడప జిల్లాకు ఏమిచ్చినా ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. నగరంలోని రహదారులు అందంగా తయారయ్యాయని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి మరణానంతరం... జిల్లాను పట్టించుకున్న వారే కరవయ్యారని చెప్పారు. ప్రముఖ నగరాల సరసన త్వరలో కడప కూడా చేరుతుందని ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: AP CM TOUR: నేడు వైఎస్‌ఆర్ జయంతి.. ఇడుపులపాయలో జగన్ పర్యటన