‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ మీట నొక్కి 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్ల బోధన రుసుముల్ని విడుదల చేశారు. ఇవి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి.
నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడు కూడా బాగా చదవాలని కోరుకుంటున్నాను. దాదాపు 73 శాతం మంది ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉన్నత విద్య చదవలేకపోతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నత చదువులు లేకపోతే పేదరికం ఎప్పటికీ పోదు. ఉన్నత చదువులతోనే పేదరికం పోతుంది. విద్యార్థులు అందరూ బాగా చదువుకోవాలన్నదే మా ఉద్దేశం. ప్రభుత్వం తరఫున విద్యార్థులకు ఇవ్వగలిగిన ఆస్తి చదువే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తాం. విద్యార్థుల తల్లితండ్రులను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తు గొప్పగా మార్చాలన్నదే మా లక్ష్యం'.
- సీఎం జగన్
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా విద్యార్థులు చదివే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సుల ఫీజుల్ని నాలుగు విడతల్లో చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 19న మొదటి విడత ఇవ్వగా.. నేడు రెండో విడత చెల్లింపులు చేపట్టారు. డిసెంబరులో మూడు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత నిధులు విడుదల చేయనున్నారు. విద్యారంగంపై ఇప్పటి వరకు రూ.26, 677 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
వసతి దీవెన పథకం ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కోసం తల్లుల ఖాతాల్లోకి నేరుగా.. ప్రభుత్వం జమ చేస్తోంది. విద్యారంగంపై ఇప్పటి వరకు 26,677.82 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. నాడు – నేడు పథకంలో భాగంగా అంగన్ వాడీలను ప్రాథమిక పాఠశాలలుగా మార్చనట్లు వెల్లడించింది. పౌష్టికాహారం కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా ఏటా మరో 1,800 కోట్ల వ్యయం చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్‌లో మొదటి విడతగా 671.45 కోట్ల రూపాయలు చెల్లించామంది.
ఇదీ చదవండి: సోషల్ మీడియా సెలబ్రిటీల సంపాదన ఎంతో తెలుసా?