ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లలో అంతు చిక్కని వ్యాధిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ ఉదయం ఉన్నతాధికారులతో సమీక్షించిన జగన్.. తక్షణం అక్కడకు వెళ్లి సమీక్షించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ సహా వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆ శాఖ కమిషనర్ కె.భాస్కర్.. కొమరేపల్లి చేరుకున్నారు.
అక్కడ నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో వివరాలు తెలుసుకున్నారు. కొమరేపల్లితో పాటు.. పూళ్లలో సీఎస్, వైద్యారోగ్య శాఖ అధికారులు పర్యటించి తాజా పరిస్థితిని పరిశీలించనున్నారు. ప్రస్తుతం కొమరేపల్లి వైద్య శిబిరంలో 10 మంది వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. వారు చెప్పిన వివరాలను ఆదిత్యనాధ్ బృందం నమోదు చేసుకుంది. మరోవైపు.. కొమరేపల్లి, పూళ్ల గ్రామాల్లో అధికారులు రెండు బృందాలుగా విడిపోయి నమూనాలు సేకరిస్తున్నారు.
వింత వ్యాధి బాధితుల రక్తం, వాళ్లు తాగుతున్న నీరు, వండుకుంటున్న కూరగాయలు, ఇతర పదార్థాల నమునాలు సేకరించనున్నారు. వింత వ్యాధిపై అధ్యయనం కోసం విజయవాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. ఈ బాధ్యతలు తీసుకుంది.
ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కేటీఆర్ కృతజ్ఞతలు