డిసెంబర్ 21న భూముల సమగ్ర సర్వే ప్రారంభం కానున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. సర్వే, రికార్డులు సిద్ధమైన అనంతరం గ్రామ వార్డు సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించారు. సర్వే కోసం తిరుపతిలో కొత్తగా కళాశాల ఏర్పాటు సహా.. ఈ నెల 9న సర్వే ఆఫ్ ఇండియాతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుందని తెలిపారు. సమగ్ర భూసర్వేపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్న సీఎం.. సర్వే వల్ల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల సమగ్ర సర్వే కోసం నిర్దేశించిన వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని డిసెంబర్ 21న ప్రారంభించనున్నారు. భూముల సమగ్ర సర్వేపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాలతో కలిపి అటవీ ప్రాంతాలు మినహా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 17,460 గ్రామాల్లో సర్వే చేయనుండగా..మొదటి విడతలో 5 వేలు, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే చేయాలని చెప్పారు.
సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి..
పట్టణాలు, నగరాల్లోని 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే జరగనుంది. 10 లక్షల ఓపెన్ ప్లాట్లు, 40 లక్షల అసెస్‌మెంట్ల భూముల్లో సర్వే చేస్తారు. 2.26 కోట్ల ఎకరాలు ఉన్న 90 లక్షల మంది పట్టాదారుల భూములూ సర్వే చేయాలని.. సర్వే కోసం, అనంతరం తీసుకోనున్న చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
ప్రతి మండలానికి ఒక డ్రోన్ బృందం, డేటా ప్రాసెసింగ్ టీం, రీసర్వే టీం ఉంటాయని తెలిపారు. 9400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని, సర్వే ఆఫ్ ఇండియా శిక్షణ ఇస్తోందని అధికారులు వెల్లడించారు. మిగిలిన వారికీ శిక్షణ పూర్తి చేస్తామన్నారు.
సర్వే తర్వాత.. ఇస్తాం..
సర్వే ఆఫ్ ఇండియాతో ఈనెల 9న అవగాహన ఒప్పందం కుదర్చుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సర్వే తర్వాత ల్యాండ్ టైటిలింగ్ కార్డు, కార్డులో యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్, భూమి కొలతలు నమోదు చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం విస్తీర్ణం, యజమాని పేరు, ఫొటో సహా క్యూ ఆర్ కోడ్ కూడా ఉంటుందన్నారు. భూ యజమానులకు హార్డ్ కాపీలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
సర్వే పూర్తైన తర్వాత డిజిటలైజ్డ్ కాడస్ట్రల్ మ్యాప్‌లు తయారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు మ్యాప్‌లో ఉంటాయని, భూ కొలతలు పూర్తైన తర్వాత సర్వే రాళ్లు పాతుతారని వివరించారు. గ్రామ సచివాలయంలో డిజిటలైజ్డ్ ప్రాపర్టీ రిజిస్టర్, టైటిల్ రిజిస్టర్, వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారని అధికారులు వివరించారు.
గ్రామా స్థాయిలోనే రెవెన్యూ సర్వీసులు
సర్వే పూర్తైన తర్వాత గ్రామస్థాయిలోనే రెవెన్యూ సర్వీసులు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఒక గ్రామంలో సర్వే పూర్తై, మ్యాప్‌లు సిద్ధం కాగానే అదే గ్రామ సచివాలయంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ సేవలు అందాలని, ఆ మేరకు గ్రామ సచివాలయంలో ఏమైనా మార్పులు కావాలంటే చేయాలన్నారు. భూవివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి అవసరమైన వాహనాలు సహా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
విస్తృతంగా ప్రచారం చేయాలి..
సమగ్ర భూసర్వేపై తప్పుడు ఆలోచనలు కలిగించేలా ప్రచారం జరుగుతోందన్న సీఎం జగన్.. సమగ్ర భూ సర్వే ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అనుమానాలకు దారి తీస్తున్న అంశాలను గుర్తించి వారికి సరైన సమాచారాన్ని చేరవేయాలన్నారు. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను మరెవ్వరూ టాంపర్ చేయలేని రీతిలో భద్రపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
భద్రతాపరమైన అంశాలు పటిష్టంగా ఉండాలన్నారు. ఆ మేరకు సర్వే వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. భూ యజమానుల వద్ద హార్డ్ కాపీ ఉండేలా చూడాలని సీఎం సూచించారు. సమగ్ర సర్వేలో భాగస్వాములు అవుతున్న సిబ్బందికి మంచి శిక్షణ, ఓరియెంటేషన్ ఇవ్వాలన్నారు. సర్వే శిక్షణ కోసం కొత్తగా ఒక కాలేజిని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలన్నారు. సమగ్ర సర్వే సందర్భంలోనే ఈ కాలేజి నిర్మాణం కూడా జరగాలన్నారు.
ఇదీ చూడండి: భారత్ బంద్ ప్రశాంతం... అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు