కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సచివాలయానికి భారత సామాజిక దార్శనికుడు, మహామేధావి అంబేడ్కర్ పేరు పెట్టడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు.
ఈ నిర్ణయం దేశానికే ఆదర్శం: ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమని కేసీఆర్ అన్నారు. దేశ ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలన్న అంబేడ్కర్ తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోందని తెలిపారు. అన్ని రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ.. అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దీని వెనక అంబేడ్కర్ ఆశయాలు ఇమిడి ఉన్నాయని గుర్తుచేశారు.
అంబేడ్కర్ దార్శనికతతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తోందని కేసీఆర్ తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి అమలు ద్వారానే అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు లభిస్తాయన్న అంబేడ్కర్ స్ఫూర్తి తమను నడిపిస్తోందని అన్నారు.
కుల, మత, లింగ, ప్రాంత వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సమాన గౌరవం లభించి.. అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన భారతీయత అని కేసీఆర్ పేర్కొన్నారు. అప్పుడే నిజభారతం ఆవిష్కృతమవుతుందని అందుకోసం తమ కృషి కొనసాగుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. అంబేడ్కర్ పేరును రాష్ట్ర సచివాలయానికి పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని ఆశామాషీకి కోరుకోలేదని పేర్కొన్నారు.
దేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే, ఆయన పేరును మించిన పేరు లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిందని.. ఇదే విషయమై ప్రధానికి త్వరలోనే లేఖ రాస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని కొత్త పార్లమెంటు భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలనికేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని మరోమారు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: త్వరలో సంక్షేమ పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ
ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తాం: నీతీశ్