Bhatti on projects: భాజపా ప్రభుత్వం అక్రమంగా 7 మండలాలను ఏపీలో విలీనం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లులోనుంచి 7 మండలాలను తొలగించిందని తెలిపారు. ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడాన్ని మేం వ్యతిరేకించినట్లు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం విభజన చట్టాన్ని విస్మరించిందని మండిపడ్డారు. ఏడు మండలాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని భట్టి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
7 మండలాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని తెరాస ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిందా? విలీనం చేయొద్దని కేంద్రంపై తెరాస ఎందుకు ఒత్తిడి చేయలేదు? ఇప్పుడు పోలవరం ఎత్తు మరో 3 మీటర్లు పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది. ఏపీ ప్రభుత్వ చర్యను తెరాస ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదు. 7 మండలాలను తిరిగి తెచ్చుకునేందుకు ఏం చేస్తారో చెప్పాలి. గతంలో చేసిన తీర్మానం అమలు కోసం ఏం చేశారో చెప్పాలి. వరద వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు. - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
వరద వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. అవగాహన లేకుండా నేతలు ప్రాజెక్టులకు డిజైన్ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని విమర్శించారు. కాళేశ్వరం రీ డిజైనింగ్‌లో పొరపాట్లు ఉన్నాయని 2014 నుంచి చెబుతూనే ఉన్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే అందరికి మంచిదని చెప్పినట్లు తెలిపారు. అవగాహన లేకుండా లక్షల కోట్లు ఖర్చు చేసి నిరుపయోగంగా మార్చారాని భట్టి మండిపడ్డారు. బ్యాక్ వాటర్‌తోనే కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మునిగిపోయాయని వెల్లడించారు. వరద బాధితులకు త్వరగా పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ముంపు సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: Puvvada on AP Ministers: జగన్‌తో చర్చించి ఐదు గ్రామాలు ఇప్పించలేరా?: పువ్వాడ
లైవ్ వీడియో: మరుసటి రోజే బర్త్‌డే.. అంతలోనే తిరిగిరాని లోకాలకు రెండేళ్ల చిన్నారి