తెలంగాణలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటు నాటికి కేవలం రూ.69వేల కోట్లు మాత్రమే అప్పులుండేవని.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,18,918 కోట్లకు చేరిందని విమర్శించారు. తాజాగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని ఐదు శాతానికి పెంచుకుని ఏడాదికి రూ. 50వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు ఆర్డినెన్స్ తెచ్చారని ఆరోపించారు.
రాబోయే కాలంలో అప్పులు రూ.6 లక్షల కోట్లు తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారని.. అదే జరిగితే వడ్డీ రూపేణా రూ.80వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికను పీసీసీకి అందజేయనున్నట్లు తెలిపారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు ఉచితంగా చికిత్స అందించాలన్నారు.
ఇవీ చూడండి: కృష్ణా బేసిన్‌లో నిండు కుండల్లా జలాశయాలు