Tension in Kuppam: ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా అధినేత చంద్రబాబు రెండోరోజు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిర్ణయించిన పర్యటన మేరకు ఉదయం 11 గంటలకు అన్న క్యాంటీన్, ఆధునికీకరించిన తెదేపా కార్యాలయం ప్రారంభిచాల్సి ఉండగా.. వైకాపా చేపట్టిన ర్యాలీతో పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబు తొలిరోజు పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో చోటు చేసుకున్న సంఘటనలను నిరసిస్తూ కుప్పం పట్టణంలో వైకాపా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉదయం వైకాపా నిరసన ర్యాలీకి అనుమతించని పోలీసులు 11 గంటల సమయంలో పరిమితులతో అనుమతించారు. కుప్పం నియోజకవర్గ వైకాపా బాధ్యుడు భరత్ ఇంటి నుంచి కుప్పం సహకార బ్యాంక్ వరకు నిరసన ర్యాలీకి అనుమతించారు. ర్యాలీగా వచ్చిన వైకాపా కార్యకర్తలు కుప్పం సహకార బ్యాంక్ దాటి ముందుకు చొచ్చుకుపోయారు. అనుమతించిన ప్రాంతం దాటి దూసుకుపోయిన వైకాపా కార్యకర్తలు బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రారంభానికి సిద్ధం చేసిన అన్న క్యాంటీన్‌పై విరుచుకుపడ్డారు.
బస్టాండ్ కూడలిలో విధ్వంసం సృష్టించిన వైకాపా శ్రేణులు ఒక దశలో తెదేపా కార్యాలయం వైపుకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కర్రలు, రాళ్లతో రణరంగం సృష్టించిన వైకాపా కార్యకర్తలు.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. పోలీసులు వారించడంతో వెనక్కి తిరిగిన వైకాపా శ్రేణులు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, భరత్, జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఆధ్వర్యంలో మరింతగా రెచ్చిపోయారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఎమ్మెల్సీ భరత్ ఇంటి వైపు వెనుతిరిగారు.
ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసిన సమాచారం తెదేపా అధినేత చంద్రబాబుకు పార్టీ శ్రేణులు తెలియజేశారు. ఆగ్రహనికి గురైన చంద్రబాబు.. తాను బస చేసిన రోడ్లు, భవనాల అతిథి గృహం నుంచి కాలినడకన బయలుదేరారు. అధినేతను అనుసరిస్తూ తెదేపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గంగమ్మ గుడి దాటిన తర్వాత ధ్వంసమైన అన్న క్యాంటీన్ వైపు వెళుతుండగా తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిఘటించేందుకు తెదేపా కార్యకర్తలు యత్నించడంతో పోలీసులు లాఠీ ఝుళిపించారు. లాఠీచార్జ్‌లో తెదేపా కార్యకర్తలు రాజు, రవితో పాటు మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
పాదయాత్రగా వస్తున్న చంద్రబాబునాయుడిని అనుసరించి తెదేపా కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పోలీసులు అడ్డు తప్పుకున్నారు. కార్యకర్తలతో కలిసి ధ్వంసమైన అన్న క్యాంటీన్ ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు వైకాపా తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దాదాపు గంట పాటు రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. తానే స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా తెదేపా కార్యాలయం వరకు తిరిగి పాదయాత్ర చేశారు.
ఇవీ చూడండి..
మునుగోడు అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులేస్తోన్న హస్తం
టిక్‌టాక్ స్టార్ మృతి కేసులో ట్విస్ట్, హత్యేనని తేల్చిన పోలీసులు, ఇద్దరు అరెస్ట్