Telangana Debt Consolidation: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రుణాలు సమీకరించడంపై స్పష్టత కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా బాండ్ల విక్రయాలను కేంద్ర ఆర్థికశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. అప్పులపై సమాచారం కోరగా రాష్ట్రాలు ఇచ్చిన వివరాలు, రుణాలు తీర్చేందుకు చూపుతున్న వనరులపై కేంద్రం సందేహాలు వ్యక్తం చేస్తూ, పూర్తి వివరాలు కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు.
కేంద్రం అడిగిన వివరాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు రెండు రోజులుగా కసరత్తు చేశారు. కేంద్రం బాండ్ల విక్రయాలను నిలిపివేయడం, కేంద్రానికి అందించిన వివరాలు, సిద్ధంచేసిన అదనపు సమాచారం తదితర అంశాలను సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. నేడు జరిగే సమావేశం అనంతరం బాండ్ల విక్రయాలకు అనుమతి లభించవచ్చని ఆర్థికశాఖ భావిస్తోంది.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకుంటున్నామని, జీఎస్‌డీపీలో రాష్ట్ర రుణాలు 27 శాతంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి వివరించింది. బడ్జెట్ వెలుపల కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలపై కూడా వివరించింది. వీటిపై కేంద్రం కోరిన అదనపు సమాచారాన్ని కూడా రాష్ట్ర అధికారులు అందచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా రూ. 53వేల 970 కోట్లు సమీకరించుకోవాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో రూ. 3వేల కోట్లు, మే నెలలో రూ. 8వేల కోట్లు, జూన్‌లో మరో రూ. 4వేల కోట్లు.. మూడు నెలల్లో మొత్తం రూ. 15 వేల కోట్ల మేర సమీకరించాలని భావించింది. ఏప్రిల్ నెల ముగిసినా బాండ్ల విక్రయం జరగకపోవడం రాష్ట్ర ఆర్థికావసరాలపై ప్రభావం చూపుతోంది. వేతనాలు, ఇతర చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
ఇవీ చదవండి: