భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు చైనా చేస్తున్న యత్నాలు ఒక్కొక్కటిగా విఫలమతుండటంతో డ్రాగన్ ఇతర వ్యూహాలు అమలు చేయాలనుకుంటోంది. అందులో భాగంగానే జరుగుతున్నదే సమాచార తస్కరణ. ఈ సమాచారం ద్వారా ప్రత్యర్థి దేశాల్లో వివిధ రూపాల్లో పరోక్షంగా దాడి చేయడం జరుగుతోంది. ఈ వ్యూహంలో చైనా పాత్ర ఇందులో కనిపించదు. అన్నింటిని కలగలిపి దేనివల్ల అశాంతి రేగిందో తెలియని పరిస్థితి కల్పిస్తుంది.
సమగ్ర వ్యూహం..
హైబ్రిడ్ యుద్ధం అనేది నిజానికి ఓ సమగ్ర సైనిక వ్యూహం. ఇందులో సైన్యం పాత్ర మాత్రం ఉండదు. ఈ వ్యూహాన్ని అమలు చేసి ప్రత్యర్థి దేశంలో రాజకీయ యుద్ధం, మిశ్రమ సంప్రదాయ యుద్ధం, సైబర్ యుద్ధం చేస్తుంది. ఇందులో నకిలీ వార్తలు, దౌత్యం, ఎన్నికల జోక్యం ద్వారా శత్రువును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. చైనా ఇప్పుడు ఇలాంటి వ్యూహాలకే పదునుపెడుతోంది. ఇందులో భాగంగా చేసినదే సమాచార తస్కరణ.
కేంద్రం ఆచితూచి..
అయితే చైనా సమాచార తస్కరణ విషయంలో కేంద్రం ఆచితూచి స్పందించింది. చైనా వైఖరి తెలిసిన వారికి ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం కనిపించదని తెలిపింది. భారత నిఘా సంస్థలకు ఈ విషయంపై ముందుగానే సమాచారం ఉందని పేర్కొంది. ఇలాంటి కారణాల వల్లే చైనా యాప్‌లను నిషేధించాలనే నిర్ణయానికి వచ్చామని.. అధికారులు వ్యాఖ్యానించారు. ప్రధాని వంటి వీఐపీలకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సైతం భారత వ్యతిరేక కార్యకలాపాలకు శత్రు దేశాలు వినియోగించవచ్చని వీరంటున్నారు.
శత్రుదేశ నిఘా..
ఇలా బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా శత్రుదేశ నిఘా సంస్థలు తమకు కావాల్సిన వివరాల్లో 80% వరకూ రాబట్టగలవని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో.. ఈ వ్యవహారశైలి ప్రపంచ దేశాలకు మూమూలేనని కూడా వారు అంటున్నారు. ప్రతిదేశం.. ఇలాంటి సమాచార విశ్లేషణ ద్వారానే ఇతర దేశాలపై ఓ కన్నేసి ఉంచుతుందన్నారు. అమెరికా అయితే సామాజిక మాధ్యమాల ద్వారా ఏకంగా 200 రకాల డేటా వివరాలను సేకరిస్తూ ఇతర దేశాలపై గట్టి నిఘా పెడుతుందని చెబుతున్నారు.
సమాచార తస్కరణ..
చైనా సమాచార తస్కరణలో ఆశ్చర్యం ఏమిలేదని భారత్ చెబుతున్నప్పటికీ.. ఈ అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇందుకు కారణం వాస్తవాధీన రేఖ వద్ద 2 దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే. ప్రస్తుతం చైనా సేకరించిన సమాచారం అంతా ఓపెన్‌సోర్స్ నుంచి తీసుకున్నది కావడం వల్ల దానిపై అంతగా ఆందోళన చెందకపోయినప్పటికీ.. ఆ సమాచారాన్ని ఉపయోగించుకునే తీరుపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు. దేశ భద్రత, ఇతర కీలక సమాచారం మాత్రం ఎన్‌క్రిప్టెడ్ పరికరాలు, ఛానళ్ల ద్వారా మాత్రమే పొందే వీలుంది. అందువల్ల ఈ సమాచారం బైటకు పొక్కే అవకాశం లేదని అంటున్నారు.
అందుకే నిషేధం..
బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం సేకరించడం పెద్ద సమస్య కాదని ఐపీ అడ్రస్ ద్వారా లేదా చైనా ఫోన్‌లను ఉపయోగించి సమాచారం సేకరించినప్పుడు సమస్య మొదలవుతుందని అంటున్నారు. ఈ ప్రమాదం ఎప్పటి నుంచో పొంచి ఉండటం వల్ల కొన్ని చైనా ఉత్పత్తులు... మొబైల్ ఫోన్లు వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన 224 యాప్‌లపై నిషేధం విధించినట్టు వెల్లడించారు. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ ఎన్సీఎస్సీ లెఫ్ట్‌నెంట్ జనరల్ రాజేశ్. ప్రస్తుతం చైనా సేకరించిన దాంట్లో ఎలాంటి కీలక సమాచారం లేదని అంటున్నారు.
సైబర్ సెక్యూరిటీ వ్యూహం- 2020
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం వివిధ దేశాలు భారత్‌లో వ్యక్తుల సమచారం చాలాకాలం నుంచి సేకరిస్తున్నాయి. అమెరికాలో ఎడ్వర్డ్ స్నోడెన్ అంశం తెరమీదకు వచ్చినప్పుడు భారత్‌లో ప్రముఖ వ్యక్తుల కీలక సమాచార సేకరణ జరుగుతున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో భారత్ తన సైబర్ భద్రతను పెంచేందుకు పలు చర్యలు తీసుకుంది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ వ్యూహం- 2020 ద్వారా సైబర్ భద్రతా విధానాన్ని మార్చాలని నిర్ణయించింది.
ఇదీ చూడండి: 'దేశంలోని రెండు కరోనా వ్యాక్సిన్లు అత్యంత సురక్షితం'