ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని సీఎం సూచించారు. తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయిన ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమన్నారు.
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ విశ్వవ్యాప్త గుర్తింపును తెచ్చిందన్నారు. బతుకమ్మను పల్లె పల్లెనా జరుపుకొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు కుంటలు నీటితో నిండి వున్నాయని.. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మహిళలు పండగను ఆనందోత్సాహాలతో, కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు.
ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
ఒక్కేసి పువ్వేసి సందమామా, ఒక్క జాము ఆయే సందమామా.. సిత్తూ సిత్తూల బొమ్మ, శివునీ ముద్దుల గుమ్మ.. అంటూ ఆటాపాటలు అలరించనున్నాయి. తీరొక్క పూలతో ఊరూవాడా లోగిళ్లన్నీ పుష్పవనాలుగా ఆవిష్కృతమవనున్నాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగ బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతోంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై చివరిరోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు పరిసమాప్తమవుతాయి. గత ఏడాది కరోనాతో బతుకమ్మ వేడుకలపై కొంత ప్రభావం పడింది. ఈ ఏడాది కొవిడ్ నుంచి కోలుకోవడంతో ప్రభుత్వం పెద్దఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తోంది.ప్రతి ఊరిలో మైదానాల వద్ద ఏర్పాట్లు చేయడంతోపాటు చెరువులు, కుంటల వద్ద బతుకమ్మ ఘాట్‌లను నెలకొల్పి నిమజ్జనం సందర్భంగా అన్ని జాగ్రత్తలను పాటించాలని కలెక్టర్లకు నిర్దేశించింది.
ఇదీ చూడండి: Bathukamma song 2021: ఏఆర్ రెహమాన్ అల్లిపూల వెన్నెల బతుకమ్మ పాట విన్నారా..?