CM KCR Meeting: ప్రగతి భవన్‌లో మంత్రులు, నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లోని సీఎం నివాసంలో జరుగుతున్న భేటీలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, ఎంపీలు, చీఫ్ విప్, విప్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, పాలనాపరమైన, రాజకీయపరమైన అంశాలపై మంత్రులు, నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, విధానాలపై చర్చించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన ఆంక్షలు, ధాన్యం సేకరణ సంబంధిత అంశాలు ప్రస్తావనకు రావచ్చని సమాచారం.
రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసిన నేపథ్యంలో సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేంద్రంలోని భాజపా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రధాన నేతలతో సీఎం కేసీఆర్ ఇప్పటికే భేటీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో.. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి..? మద్దతిచ్చే విషయంలో ఎలా వ్యవహరించాలి..? అన్న అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు వినికిడి. వానాకాలం పంటల సాగు, రైతుబంధు సాయం పంపిణీ సహా ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి :