కోడి మాంసం ప్రియులకు ఇది నోరూరించే వార్తే. రాష్ట్రంలో వాణిజ్య డిమాండ్ తగ్గడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో గత నెల రోజుల్లోనే కిలో బ్రాయిలర్ కోడి మాంసం ధర రూ.270 నుంచి 170కి తగ్గింది. కరోనా విలయతాండవంతో ఫంక్షన్లు, సభలు, సమావేశాలు దాదాపుగా తగ్గిపోయాయి. సామూహిక భోజనాలుంటేనే కోడిమాంసం అమ్మకాలు బాగా పెరుగుతాయి. అవి లేనందున డిమాండ్ 30 శాతం వరకూ పడిపోయింది. సాధారణంగా తెలంగాణలో రోజుకు సగటున 9 లక్షల కిలోల కోడి మాంసం విక్రయాలుంటాయి. ఇప్పుడు 5 లక్షల కిలోలకు మించి పోవడం లేదు. హోటళ్లలో సాధారణంగా రాత్రిపూట అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ వల్ల అమ్మకాలు తగ్గాయని కోళ్ల ఫారాల సమాఖ్య తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్రలో లాక్‌డౌన్‌తో.. తెలంగాణ నుంచి ఆ రాష్ట్రాలకు కోళ్ల రవాణా పెద్దగా లేదు. మరోవైపు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని సరిహద్దు జిల్లాలకు కోళ్లను తక్కువ ధరకు తరలిస్తున్నారు.
రూ.90 వరకూ రైతు పెట్టుబడి
వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో కోడి మాంసానికి పెద్దగా డిమాండ్ లేదు. మార్చి నాటికి డిమాండ్, ధర బాగా పెరిగాయి. దీంతో రైతులు కోళ్ల పెంపకాన్ని పెంచారు. ఇప్పుడు మళ్లీ విక్రయాలు తగ్గడంతో నష్టం వస్తోందని కోళ్ల రైతులు తెలిపారు. వేసవి ఎండలు 40 డిగ్రీలు దాటిన ప్రాంతాల్లో కోడి పిల్లలను కాపాడటమూ రైతులకు కష్టమవుతోంది. కిలో బరువు కోడిని పెంచాలంటే సగటున రూ.90 వరకూ రైతు పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు కిలో బరువున్న కోడిని రూ.66కే మాంసం వ్యాపారులకు విక్రయించడం వల్ల రైతులకు నష్టం వస్తోంది.
కోలుకుంటున్న గుడ్డు
వారం క్రితం కోడిగుడ్డు టోకు ధర రూ.4.56 కాగా.. ఇప్పుడు రూ.3.59 ఉంది. 3 రోజుల క్రితం రూ.3.10కి పడిపోయి మళ్లీ కోలుకుంది. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల కోళ్ల ఫారాల్లో రోజుకు 90 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. అందులో 40 లక్షల గుడ్లు బయటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. పొరుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో ఎగుమతి నిలిచిపోయింది. రాష్ట్రంలోనూ హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలలు మూతపడి మధ్యాహ్న భోజనం వంటివన్నీ రద్దు కావడంతో గుడ్ల అమ్మకాలు బాగా తగ్గాయని తెలంగాణ కోళ్ల ఫారాల సమాఖ్య అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ‘ఈనాడు’కు చెప్పారు.
మండుతున్న మటన్, నాటుకోడి ధరలు
బ్రాయిలర్ కోడి మాంసం ధరలు పతనమైనా, నాటుకోడి, మటన్ ధరలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో నాటుకోళ్ల కొరత కారణంగా కిలో ధర రూ.400 వరకూ చెబుతున్నారు. కడక్‌నాథ్ (నలుపు రంగు) కోడి మాంసాన్ని ఆన్‌లైన్‌లో కిలో రూ.400 నుంచి 500 వరకూ అమ్ముతున్నారు. గొర్రె, మేక మాంసం ధర రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి కిలో రూ.700 నుంచి 800 వరకూ పలుకుతోంది. ‘‘తమిళనాడు వ్యాపారులు తెలంగాణ నుంచి మేకలు, గొర్రెలను నిత్యం కొని తీసుకెళుతున్నారు. ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొని తెచ్చి ఇక్కడ మాంసం అమ్మేవారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకం కార్యక్రమంతో ఉత్పత్తి పెరిగి ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ లక్ష్మారెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు.
ఇదీ చూడండి : చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్న రైతులు.. కొర్రమీనుతో మంచి లాభాలు