Cheruku Sudhakar complaint o Venkat Reddy: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేకి ఫిర్యాదు చేశారు. తనను, తన కుమారుడిని చంపుతానని ఎంపీ కోమటిరెడ్డి బెదిరించారని ఠాక్రేకి తెలిపారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. సొంత పార్టీ నేతనైన తనను చంపుతానని బెదిరించడం అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్దమని వివరించారు. పార్టీ పరంగా ఎంపీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్ ఠాక్రేని కోరారు.
"ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన కుమారుడు సుహాస్‌తో మాట్లాడిన సంభాషణను మీరందరూ విన్నారు. అందులో నన్ను చంపేస్తాం, నీ ఆసుపత్రిని కూల్చేస్తామన్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టమేమి లేదు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీలోని నేతలు నాపై సానుకూలంగా స్పందించారు. దీనిపై మాణిక్‌రావు ఠాక్రేకు ఫిర్యాదు చేశాను. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దగ్గర నేను క్షమాపణలు కోరడం లేదు. క్షమాపణల కోసం ఎదురు చూసే వ్యక్తిని కాదు నేను." - చెరుకు సుధాకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు
తనను కొంతమంది చంపుతామని బెదిరిస్తూ వీడియోలు పోస్ట్ చేశారంటూ ఈరోజు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన లెటర్ ప్యాడ్‌తో.. వెంకట్‌రెడ్డి పీఏతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు వెంకట్‌రెడ్డిపై నల్గొండ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను చంపుతానంటూ ఫోన్‌లో బెదిరించారని ఆయన ఫిర్యాదులో వెల్లడించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను చెరుకు సుహాస్ ఆశ్రయించారు. కోమటిరెడ్డి వల్ల తమ కుటుంబానికి హాని ఉందని.. తమకు భద్రత కల్పించే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఆర్సీని కోరినట్లు సుహాస్ వివరించారు.
అంతకు ముందు గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పరస్పర అవగాహనతో పోరాడుతున్నాయని ఠాక్రే ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుంచి డబ్బులు కొల్లగొట్టి.. రాబోయే ఎన్నికల కోసం సిద్ధం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో.. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుందని మాణిక్‌రావు ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులతోనే దర్యాప్తు సంస్థల్లో కదలిక వచ్చిందని.. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు. ఇలాంటి అవినీతి చర్యలకు పాల్పడే వారికి.. తమ పార్టీ మద్దతిచ్చే ప్రసక్తేలేదని పవన్ ఖేరా స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు
రాష్ట్రంలో రైతులను బాగు చేయలేని కేసీఆర్.. దేశంలో బాగు చేస్తారా?: రేవంత్‌రెడ్డి
'మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు'.. దిల్లీ మహిళా చీఫ్ సంచలన వ్యాఖ్యలు