హైదరాబాద్ మెట్రో రైలు వేళలను రాత్రిపూట అరగంట పెంచారు. ఈ రోజు నుంచి చివరి మెట్రో టెర్మినల్ స్టేషన్ నుంచి రాత్రి 10 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది. రాత్రి 11 గంటల 15 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుతుంది. ఇప్పటివరకు చివరి మెట్రో రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు ఉంది. ఎప్పటిలాగే మొదటి మెట్రోరైలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుందని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో తెలిపింది.
కొవిడ్ అనంతరం ఆంక్షల నేపథ్యంలో ఏడాదిన్నరగా మెట్రో రైలు వేళలను కుదించారు. ప్రయాణికుల నుంచి క్రమంగా ఆదరణ పెరుగుతుండడంతో మెట్రోరైలు వేళలను క్రమంగా పొడిగించుకుంటూ వస్తున్నారు.పెట్రోల్ ధరలు భారీగా పెరగడం, ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటం, రహదారులపై ట్రాఫిక్ దృష్ట్యా వేగంగా గమ్యం చేరేందుకు ప్రయాణికులు తిరిగి మెట్రో వైపు చూస్తున్నారు. మూడు మార్గాల్లో రెండు లక్షలకు పైగా ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీ వేళల్లో నిలబడే ప్రయాణిస్తున్నారు.
మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గానికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ ఉంది. నాగోలు నుంచి రాయదుర్గం మార్గంలో క్రమంగా పెరుగుతున్నారు. మూడు మార్గాల్లో కలిపి ప్రతిరోజు 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం 55 మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. ప్రతి ఐదు నిమిషాలకు ఒక మెట్రో తిరుగుతోంది. ప్రయాణికుల డిమాండ్‌తో రాత్రిపూట మెట్రో వేళల పొడిగింపుతో ఆలస్యంగా విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే వారికి సౌకర్యంగా ఉండనుంది.
ఇదీ చదవండి: KTR: హైదరాబాద్‌కు మరో బయోఫార్మా హబ్: మంత్రి కేటీఆర్