Chandrababu Naidu in Sankranti Celebrations: ఏపీలోని నారావారిపల్లెలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, గ్రామస్థులతో కలిసి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు పండుగను వైభవంగా జరుపుకొన్నారు. సంప్రదాయ వస్త్రధారణతో.. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్న నారా, నందమూరి కుటుంబాలు తరతరాల సంప్రదాయాన్ని కొనసాగించారు. సన్నిహితులు, స్నేహితులు, బంధువులతో రెండు రోజుల పాటు సరదాగా గడిపారు.
ఉద్యోగాలు, ఉన్నత చదువులు, వ్యాపారాలు అంటూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న వ్యక్తులంతా.. సంక్రాంతి పండుగును సొంతూళ్లలో జరుపుకోవాలనే సూచించే చంద్రబాబు.. ఈ సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో ఘనంగా జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి పండుగను జరుపుకుంటూ సరదాగా, సంతోషంగా గడిపారు. ఉదయం కుటుంబసభ్యులతో కలిసి గ్రామ దేవతలైన సత్యమ్మ, నాగాలమ్మల దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు: చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్, నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు వేడుకల్లో పాలుపంచుకున్నారు. సంప్రదాయ దుస్తులతో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు జరిపిన అనంతరం తన తల్లిదండ్రులు నారా అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడు సమాధులకు చంద్రబాబు నివాళులర్పించారు. తన నివాసం ఎదుట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.
నాగాలమ్మ కట్ట వద్ద బాలకృష్ణ, చంద్రబాబు తమ మనవళ్లతో కొద్ది సేపు ఆడుకున్నారు. నారావారిపల్లెకు వచ్చిన ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రెండు రోజుల పాటు గ్రామస్థులతో, బంధువులతో సంక్రాంతి సంబరాలను జరుపుకున్న చంద్రబాబు మూడో రోజు నారావారిపల్లెలో బస చేయనున్నారు. లోకేష్, బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబసభ్యులు తిరిగి వెళ్లారు.
టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్న బాబు: మూడు రోజులుగా నారావారిపల్లెలో బస చేసిన చంద్రబాబు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. పీలేరు వెళ్లనున్న ఆయన స్ధానిక సబ్ జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు. ఈ నెల 7న పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్లలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు తొలగించారు.
ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పరస్పరదాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుల పై హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి పీలేరు జైలుకు తరలించారు. అక్రమ కేసులతో కేసులు ఎదుర్కొంటూ జైలులో ఉన్న కార్యకర్తలను సోమవారం పరామర్శించనున్నారు.
ఇవీ చదవండి: