టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకుని తారకరత్న ఇంటికి వెళ్లారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, ఆయన భార్య నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో చంద్రబాబు తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. నందమూరి తారకరత్న మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని చంద్రబాబు అన్నారు. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు.
తారకరత్న మృతి చాలా బాధాకరం.. 23 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయారు. చిన్న వయసులో చనిపోవడం బాధేస్తోంది. సినీ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి . ఒకేరోజు 9 సినిమాలకు ప్రారంభోత్సవం చేశారు. ఎప్పుడూ రాజకీయాలపట్ల ఆలోచన ఉన్న వ్యక్తి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.' - నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
తారకరత్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి.. సినీ నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న మృతిపట్ల ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. ఆయన మరణం తీరని లోటని కొనియడారు. తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిన్న వయసులోనే మరణించడం దుదృష్టకరం: కిషన్‌రెడ్డి
నందమూరి తారకరత్న మృతికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ‘‘విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న ఆయన చిన్న వయసులోనే మరణించడం చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నా’ను అని అన్నారు.’
తారకరత్న మరణం సినీ లోకానికి తీరని లోటు: రేవంత్‌రెడ్డి
నందమూరి తారకరత్న మరణ వార్త నన్ను కలచివేసింది. చిన్న వయసులోనే సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న మరణం సినీ లోకానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నాను. తారకరత్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ను.
ఇవీ చదవండి: