ఏపీలోని
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తెదేపా అధినేత చంద్రబాబు 17 నెలల్లో సీఎం జగన్ ప్రజలకు తీవ్రనష్టం కలిగించారని ధ్వజమెత్తారు. దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టి భూకుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసుల మాఫీ కోసం జగన్ కేంద్రం కాళ్లు పట్టుకుంటూ ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో బీసీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లు అమలుకు అడుగులేస్తే..జగన్ కుట్ర పూరితంగా బీసీల్లో చీలికలు తీసుకువచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు.
సమాజం కోసం తెలుగుదేశం పని చేస్తే సీఎం జగన్ వ్యక్తిగతం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. చలో మదనపల్లి సందర్భంగా తెదేపా నేతల గృహనిర్బంధం చేయడాన్ని ఖండించిన ఆయన ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును నొక్కడం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. మహిళలపై దాడులు దేశంలోనే అత్యధికంగా ఏపీలో జరగటం జగన్ రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. శాంతి భద్రతలు ఎక్కడ అదుపు తప్పినా కలుగజేసుకుంటామని న్యాయస్థానాలు చెప్తుంటే జగన్ వర్గం ఇష్టానుసారంగా కోర్టులనే నిందిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కరోనా జాగ్రత్తలపై పార్టీ తరఫున ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభిస్తామన్న చంద్రబాబు.. దానిద్వారా వైద్య నిపుణులు, మేథావులు కూడా అందుబాట్లో ఉంటారని వెల్లడించారు.
ఇదీ చదవండి : అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు..