రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కొవిడ్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి... నివేదికను తయారుచేసి... కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు సమర్పించింది. దీనిలో కరోనా నిర్ధరణ పరీక్షలు, సహా పలు అంశాలపై తమ పరిశీలనలను పొందుపరిచింది.
ఆయా అంశాలను పరిశీలించిన కేంద్రం వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు సరిపోవని... రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. రాష్ట్రంలో లాక్డౌన్ అమలుతీరును మెచ్చుకున్నా... టెస్ట్‌ల నిర్వహణపై మాత్రం పెదవి విరిచింది.
దేశంలో అతి తక్కువ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను పేర్కొంది. తక్షణమే నిర్ధరణ పరీక్షల సంఖ్యని పెంచి... ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్‌లను పూర్తిగా వినియోగించుకోవాలని సూచిస్తూ... లేఖ రాసింది.
తక్కువ పరీక్షలు చేస్తున్నా..
17 జిల్లాల్లో అతి తక్కువ టెస్టులు చేస్తున్నప్పటికీ దేశ సగటుతో పోలిస్తే అత్యధికంగా కేసులు నమోదవుతున్నట్లు వివరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే చేసి... వైరస్ బారిన పడిన వారిని గుర్తించాలని సూచించింది. మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, జనగామ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో ఎఫెక్టివ్ కంటైన్మెంట్ ప్లాన్స్‌ని అమలు చేయాలని పేర్కొంది.
ఇదీ చూడండి: కాస్త తగ్గింది.. రాష్ట్రంలో మరో 1,198 కరోనా కేసులు