Yadadri Power Station funds issue : తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)కు గతంలో మంజూరు చేసిన రుణాల విడుదలను ఆపివేయడం కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్యనే చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయం పెరుగుతుందని, జాప్యమైతే విద్యుత్ డిమాండును తీర్చడం కష్టమవుతుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు లేఖ రాశారు. రుణం విడుదల చేయకపోవడంతో యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణ సంస్థ ‘భెల్’ ఇబ్బందులు పడుతోందని ఆయన పేర్కొన్నారు.
రూ.705 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి: తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర జెన్‌కో.. మణుగూరు సమీపంలో 1080 మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి, 4 వేల మెగావాట్లతో నల్గొండ జిల్లా దామెరచర్ల సమీపంలో యాదాద్రి, కొత్తగూడెంలో మరో 800 మెగావాట్ల సామర్థ్యంతో 7వ దశ విద్యుత్కేంద్రాల నిర్మాణాలను చేపట్టింది. ఈ మూడు కాంట్రాక్టులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భెల్‌కే రూ.30 వేల కోట్లతో అప్పగించారని మహేంద్రనాథ్ పాండే లేఖలో గుర్తుచేశారు. యాదాద్రికి గత ఏప్రిల్ నుంచి నిధులు విడుదల చేయకపోవడం వల్ల జులై నాటికి రూ.705 కోట్ల బకాయిలు పేరుకుపోయి భెల్ ఇబ్బంది పడుతోందని పేర్కొన్నారు.
పరిశ్రమల మంత్రి లేఖతో కేంద్ర విద్యుత్ శాఖ స్పందించింది. ఈ రుణం ఎందుకు ఆగింది, పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోందో చెప్పాలని తెలంగాణ జెన్‌కోకు ఆ శాఖ తాజాగా లేఖ రాసింది. పాండే లేఖను కూడా జతచేసింది.
రావాల్సింది రూ. వెయ్యి కోట్లకు పైనే: ‘గ్రామీణ విద్యుదీకరణ సంస్థ’ (ఆర్‌ఈసీ), విద్యుత్ ఆర్థిక సంస్థ (పీఎఫ్‌సీ)లు గత ఏప్రిల్ నుంచి యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాలకు రుణ నిధుల విడుదలను ఆపివేశాయి. జెన్‌కో ఈ రుణ ఒప్పందాలను ఆర్‌ఈసీ పీఎఫ్‌సీతో చేసుకుంది. కానీ అనూహ్యంగా వాటికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇస్తూ మళ్లీ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటేనే మిగిలిన రుణం విడుదల చేస్తామని ఇటీవల ఆర్‌ఈసీ జెన్‌కోకు లేఖ రాసింది. భద్రాద్రి కేంద్రం పూర్తి కాగా, దానికి స్వల్పంగానే సొమ్ము విడుదల కావాల్సి ఉంది.
యాదాద్రికి సంబంధించి.. కేంద్ర మంత్రి లేఖలో జులై నెలాఖరు గణాంకాలనే పరిగణనలోకి తీసుకున్నారని.. రావాల్సిన మొత్తం ఆగస్టు నెలాఖరు నాటికే రూ. వెయ్యి కోట్లు దాటిందని జెన్‌కో వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ఆసక్తికర చర్చకు దారితీశాయి.