కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుండగా ఆలోపు పూర్తిచేయాల్సిన కార్యాచరణపై కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం సమన్వయ కమిటీలు ఏర్పాటుచేశారు. రెండుబోర్డులు సమన్వయ కమిటీ తొలిసమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశాయి.
తెలంగాణ నుంచి స్పష్టత రాలేదు
బోర్డు సభ్యకార్యదర్శి కన్వీనర్‌గా.. మొత్తం 11 మంది సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బోర్డు సభ్యులు ఇద్దరు, కేంద్ర జలశక్తి శాఖ ప్రతినిధి, ఏపీ, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, ట్రాన్స్ కో, జెన్ కో ఎండీలు సమన్వయ కమిటీలో ఉన్నారు. గెజిట్ అమలు కార్యాచరణపై భేటీలో చర్చిస్తారు. క్లాజుల అమలు కోసం తీసుకున్న చర్యల పురోగతిపైనా.. చర్చ జరగనుంది. సంబంధిత పత్రాలతో సమావేశానికి హాజరు కావాలని సభ్యులను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరపు సభ్యులు సమావేశానికి హాజరవుతున్నారు. తెలంగాణ అధికారులు హాజరువుతారా లేదా అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి
సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే సమన్వయ కమిటీని సమావేశపరచాలని కోరారు. ఆ లేఖపై స్పందించిన జీఆర్ఎంబీ నోటిఫికేషన్ అమలుకు నిర్దిష్టగడువులతో తక్షణ కార్యాచరణ ఖరారు చేయాలని కేంద్ర జలశక్తిశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని తెలిపారు. వాటన్నింటినీ.. ఇవాళ సాయంత్రంలోగా కేంద్రానికి నివేదించాల్సి ఉందని పేర్కొన్నారు. అమలు కార్యాచరణ, గడువులపై సమన్వయ కమిటీలో.. చర్చించాల్సిన అవసరం ఉందని వాటిపై చర్చించి తగిన చర్యలు తీసుకున్న తర్వాత.. బోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈపరిస్థితుల్లో సంబంధిత పత్రాలతో ఇవాళ జరిగే సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కావాలని గోదావరి బోర్డు.. తెలంగాణను కోరింది. దీనిపై ప్రభుత్వం, అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
ఇదీ చూడండి: