ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ యోజన ( ఆశ ) పథకం కింద నిధులు పెంచకపోవడానికి రాష్ట్రాల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాకపోవడమే కారణమని బడ్జెట్‌లో కేంద్రం తెలిపింది. ఈ పథకంలో భాగంగా మద్దతు ధరకు... పంటల కొనుగోలు ధరకు మధ్య ఉన్న అంతరం మేరకు రైతుకు సొమ్ము చెల్లిస్తారు.
గత ఏడాది నుంచి..
తగ్గిన ధర చెల్లింపు పథకం ( పీడీపీఎస్ ) పేరుతో ఆశలో భాగంగా 2018- 19లో మధ్యప్రదేశ్‌లో సోయాచిక్కుడు పంటను రైతుల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. అంటే అప్పుడు మద్దతు ధరకన్నా మార్కెట్‌లో వ్యాపారులు కొన్న ధరకు మధ్య సగటు 6 శాతం వ్యత్యాసం ఉంది. ఈ 6 శాతాన్ని పీడీపీఎస్ కింద రైతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెల్లించింది. దీన్ని ఏ రాష్ట్రంలోనైనా అమలుకు గతేడాది నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం అనుమతించింది.
కేటాయింపుల్లో తగ్గుదల..
ఈ పథకం అమలుకు 2018- 19లో రూ.4,721.12 కోట్లు ఇచ్చింది. తిరిగి ప్రస్తుత ఏడాది ( 2019-20 )లో రూ.1,500 కోట్లు ఇస్తే రాష్ట్రాలు అడగకపోవడం వల్ల సవరించిన అంచనాల్లో ఈ కేటాయింపులను రూ.321కోట్లకు తగ్గించేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ( 2020- 21 )లో ఆశ కింద రూ.500 కోట్లు కేటాయించింది. పీడీపీఎస్‌ను రాష్ట్రాలు అమలు చేస్తే ఈ నిధులు కేటాయిస్తామని తెలిపింది. కేంద్రం నేరుగా కొనే పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి పథకాల కోసం ఏడాదికి రూ.2వేల కోట్లకు తగ్గించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిధులు కేటాయించుకుంటే తప్ప మద్దతు ధరలకు పంటలను కొనడం సాధ్యం కాదు.
దిగుబడిలో 25 శాతం కొంటాం..
ప్రస్తుత సీజన్‌లో రైతులు పండించిన కందులు సోయాచిక్కుడు, మినుములు, పెసలు, సెనగలను మాత్రమే రాష్ట్రం మొత్తం దిగుబడిలో 25 శాతం కొంటామని కేంద్రం తెలిపింది. ఈ శాతాన్ని కనీసం 40కి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుండగా... మరోవైపు పీడీపీఎస్ కింద ఏ రాష్ట్రమూ నిధులు అడగటం లేదని బడ్జెట్ పుస్తకాల్లో కేంద్రం ప్రకటించడం గమనార్హం.
ఇవీ చూడండి: కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే: కేసీఆర్