రాష్ట్రానికి ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లతోపాటు టీకాల సరఫరాను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేసి చెప్పారు. రాష్ట్రానికి ప్రస్తుతం ఇస్తున్న 5 వేల 500 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల సంఖ్యను సోమవారం నుంచి 10 వేల 500కి పెంచుతున్నట్లు సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని సీఎం కేసీఆర్... ఇటీవల ప్రధాని మోదీకి విజ్ఞప్తిచేశారు. ఈ నేపథ్యంలో అదనంగా మరో 200 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్లు పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయ్, ఒడిశాలోని అంగుల్, పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఆయా ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సరఫరాను సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గోయల్ కోరారు. కొవిడ్ టీకాల సరఫరాను కూడా పెద్దమొత్తంలో పెంచాలన్న సీఎం కేసీఆర్ విజ్ఞప్తిపై కూడా పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. రెండో డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. తాము రెండో డోస్‌కే ప్రాధాన్యతని ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్సష్టంచేశారు. అందరికీ కరోనా వైద్యం అందించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణకు భారంగా మారే పరిస్థితి ఉంటుందని గోయల్ వ్యాఖ్యానించారు. ఇందులోభాగంగా ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, టీకాలను తక్షణమే సరఫరా చేయాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు... ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు గోయల్ వివరించారు.
ఇదీ చదవండి: బ్లాక్‌ఫంగస్ కేసుల తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం