Toll Charges Hike in Telangana : ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. జాతీయ రహదారుల టోల్ ప్లాజాల చార్జీలను పెంచుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఒకటో తేదీ నుంచి పెంచిన ఛార్జీలు అమలుకానున్నాయి. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై మొత్తం 28 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో ఏడు, హైదరాబాద్‌లో 11, వరంగల్‌లో ఐదు, ఖమ్మంలో ఐదు టోల్ ప్లాజాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ప్లాజాల ఛార్జీలను కేంద్రం పెంచుతోంది.
5 శాతం వరకు పెరగనున్న ఛార్జీలు : ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలపై ఈసారి 5 శాతం వరకు ఛార్జీలు పెరగనున్నాయి. చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు సమీప ఏక మొత్తానికి రౌండఫ్ పేరుతో కొన్ని టోల్ ప్లాజాల పరిధిలో కొంతమేరకు అదనంగా పెంచినట్లు తెలుస్తుంది. టోకు ధరల సూచీ, జీడీపీ గణాంకాల ఆధారంగా ప్రతి ఏటా టోల్ ఛార్జీలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఖరారు చేస్తుంది. గడిచిన సంవత్సరం టోల్ ప్లాజాల ఛార్జీల పెరుగుదలతో పోలిస్తే ఈ ఏడాది ఒకటో తేదీ నుంచి అమలుచేసే టోల్ సవరణలో ఛార్జీలు స్వల్పంగా తగ్గినట్లు ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, దిండి, యాదాద్రి, వరంగల్, భూపాలపట్నం, నాగ్‌పూర్, మహారాష్ట్రలోని కళ్యాణ ప్రాంతాలకు వెళ్లేందుకు రహదారులు ఉన్నాయి. తెలంగాణ పరిధిలో సుమారు 28 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-వరంగల్ మార్గాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. సొంత కారులో... 24 గంటల వ్యవధిలో హైదరాబాద్ నుంచి విజయవాడకు... జాతీయ రహదారి మీదుగా వెళ్లి రావాలంటే.... ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 490 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రూట్‌లో టోల్ ప్లాజాల వద్ద 465 రూపాయలు చెల్లిస్తున్నారు.
ఈ మార్గాల్లో 325 రూపాయలు చెల్లించాల్సిందే : గత ఏడాదితో పోల్చితే ఈ రూట్‌లో ప్రయాణించే వారు... 25 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. కేవలం ఒకవైపు వెళ్లేవారు... లేదంటే ఒకవైపు వచ్చే వారు ప్రస్తుతం 310 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఈ మార్గాల్లో 325 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి... ఒకవైపు వెళ్లే వాహనదారులు 15 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మినీబస్సులు, లైట్ మోటార్ వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు, భారీ, అతి భారీ వాహనాలపైనే ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తంపై ఏప్రిల్ 1 నుంచి 5 శాతం అదనంగా వసూలు చేయనున్నారు.
ఇవీ చదవండి: