CEC warns to Panchayati Raj : స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు గ్రాంట్లు విడుదల చేయండంపై పంచాయతీరాజ్ శాఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతి లేకుండా నిధులు విడుదల చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమేనని పేర్కొంది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ సూచించారు.
సీఎస్ సోమేశ్‌కుమార్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం హెచ్చరించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా పట్టణ ప్రాంత స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను హెచ్చరించింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఆ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డిలకు రికార్డు చేయదగ్గ హెచ్చరికతో పాటు కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు చెందిన 12 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 16న నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యుల గౌరవవేతనాన్ని 30 శాతం పెంచుతూ పురపాలకశాఖ నవంబర్ 18న ఉత్తర్వులు జారీ చేసింది.
మరుసటి రోజే ఆ ఉత్తర్వును ఉపసంహరించుకొంది. ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా ఓటర్లుగా ఉన్న పట్టణ ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవవేతానాలు పెంచుతూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
ఇవీ చూడండి: local bodies representatives: వారికి తీపికబురు.. గౌరవ వేతనాల పెంపు
honorarium: మేయర్, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్ల గౌరవ వేతనాలు పెంపు