మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 27వ వర్థంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, అభిమానులు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని ఆయన సమాధి వద్ద కుమారులు బాలకృష్ణ, రామకృష్ణతో పాటు మనవలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, మనవరాలు సుహాసిని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలుగుజాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఆయన అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఎన్టీఆర్ ఆశయాల కొనసాగింపునకు కుటుంబ సభ్యులమంతా కట్టుబడి ఉంటామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో... బాలకృష్ణ చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.
ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీని స్థాపించి ఎంతో మందికి రాజకీయ ఓనమాలు నేర్పారు. ఎన్నో సాహసోపేతమైన పథకాలు తెచ్చారు. పేదవాడి ఆకలి తీర్చిన అమ్మ, ఆడవారికి అండగా నిలిచిన అన్న ఎన్టీఆర్. టీడీపీ అనేది రాజకీయ పార్టీ కాదు ఒక వ్యవస్థ. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలి. - బాలకృష్ణ
అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రసూల్‌పురలో అమర జ్యోతి ర్యాలీని బాలకృష్ణ ప్రారంభించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేశారని, తెదేపాకు పూర్వవైభవం తీసుకు రావడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మెగా లెజండరీ రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ట్రస్ట్ ఎండీ నారా భువనేశ్వరి ప్రారంభించారు.
తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవ చిరస్మరణీయం. వర్ధంతి కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున నిర్వహిస్తాం. దేశ రాజకీయాలను ఎన్టీఆర్ ప్రభావితం చేశారు. దేశాన్ని సంక్షేమ బాట పట్టించిన మహనీయుడు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు నిలిచి ఉంటుంది. - కాసాని జ్ఞానేశ్వర్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
భద్రాచలంలో తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిరలోని అంబర్‌పేట చెరువులో ఈత పోటీలు నిర్వహించి, అనాధలకు అన్నదానం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య... ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ వర్ధంతిలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మ సంఘంలో ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా జరిగిన వర్థంతి కార్యక్రమాల్లో ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రకటించారు.
ఇవీ చూడండి..