మద్యం సేవించి వాహనాలు నడపడం... పరిమితికి మించి వేగం... అసలు తాము ఎలా వాహనాలు నడుపుతున్నామో కూడా తెలియకుండా తయారైంది కొందరు వాహనదారుల పరిస్థితి. ఇటీవల కాలంలో నగర శివార్లలో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారు.. అధికంగా మద్యం మత్తులో వాహనాలు నడిపడం వల్లనే మృతి చెందుతున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. ప్రధానంగా ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్నాయి.
దర్యాప్తులో తేలింది
అబ్దుల్లాపూర్ మెట్‌లోని రాగన్నగూడలోని జీవీఆర్ కాలనీకి చెందిన తల్లి, కుమారుడు ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరుగు పయనమయ్యారు. అదే సమయంలో వేగంగా వచ్చిన టాటా సఫారీ వారి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో ఘటన మాదాపూర్‌లోని కొండాపూర్‌కు చెందిన దంపతులు గౌతమ్‌దేవ్, శ్వేత కలిసి ద్విచక్ర వాహనంపై కొండాపూర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో బాచుపల్లికి చెందిన కాశీ విశ్వనాథ్, అతని మిత్రుడు కౌశిక్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం సేవించాడు.. వేగంగా వెళ్తూ సైబర్‌టవర్స్ వద్ద ముందుగా వెళ్తున్న దంపతుల వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో గౌతమ్‌దేవ్ మృతి చెందగా, అతని భార్య తీవ్రంగా గాయాలపాలైంది. ఈ తరహా ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వాటిని కట్టడి చేయడానికి చర్యలు చేపట్టేందుకు సైబరాబాద్ పోలీసులు ఉపక్రమించారు.
10 ఏళ్ల కారాగార శిక్ష !
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదంలో ఇతరుల మృతికి కారకులైతే వారిపై హత్య కేసుతో సమానమైన శిక్ష నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఆ కేసు నమోదైన వారికి 10 ఏళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ప్రతి రోడ్డు ప్రమాదం కేసును ఇక నుంచి రోడ్డు ట్రాఫిక్ ప్రమాదం పర్యవేక్షణ విభాగం పరిశీలించనుంది. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనదారులు చట్టం నుంచి తప్పించుకోకుండా కట్టుదిట్టంగా కేసులు నమోదు చేయనున్నారు. పబ్బుల యాజమాన్యాలు కూడా... పబ్బుల్లో మద్యం సేవించిన వారు వాహనాలు నడపకుండా చూసుకోవాలని... లేని పక్షంలో వారిపైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
కఠిన చర్యలు
ప్రమాదం జరిగిన తర్వాత అందుకు బాధ్యులైన వాహనదారులు... ఘటనా స్థలం, ఆధారాలు మాయం చేసి తప్పించుకోవాలని చూసినా.. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని... రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టనున్న దృష్ట్యా వాహనదారులు నిబంధనలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : పండుగ వేళ ప్రమాదం... ఆహుతైన 1200 కోళ్లు