ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణకు వివిధ రాష్ట్రాల హైకోర్టులు కార్యాచరణ రూపొందించాయి. ఈ మేరకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా కార్యాచరణ ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. దేశ వ్యాప్తంగా 4,859 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల్లో అగ్రభాగాన యూపీ, రెండో స్థానంలో బిహార్ నిలవగా.. తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై మొత్తం 143 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ ప్రత్యేక కోర్టుల్లో 118 కేసులు పెండింగ్‌లో ఉండగా.. మరో 25 కేసులు సీబీఐ సహా ఇతర కోర్టుల్లో ఉన్నట్లు వెల్లడించారు.
కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించిన తెలంగాణ హైకోర్టు.. సీబీఐ ప్రధాన కోర్టులో ఉన్న 17 కేసులను 9 నెలల్లో ముగించే దశలో ఉన్నట్లు వెల్లడించింది. మరో 11 కేసుల్లో సీబీఐ, 5 కేసుల్లో ఈడీ ఛార్జీషీట్ ఫైల్ చేసిందని నివేదికలో వెల్లడించింది.
తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రతి శనివారం విచారణ జరపనున్నారు. కేసుల విచారణ, పురోగతి కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటుకు హైకోర్టు నిర్ణయించింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టును ఆదర్శంగా తీసుకోవాలన్న అమికస్ క్యూరీ.. మిగలిన రాష్ట్రాల హైకోర్టులు సైతం వెబ్‌సైట్ రూపొందించేలా చూడాలని కోరారు. కేసుల పురోగతిపై నివేదిక సమర్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న అమికస్ క్యూరీ.. సీబీఐ, ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని కేసుల పురోగతిపై నివేదిక తయారు చేయాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణతో పాటు దర్యాప్తునూ హైకోర్టు పర్యవేక్షించాలని సూచించారు.
సాక్షుల సంరక్షణ చట్టం-2018ని ప్రత్యేక కోర్టులు అమలు చేసేలా ఆదేశాలకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను నియమించాలని విన్నవించారు.
కేసుల విచారణ వేగవంతానికి వీరంతా సహకరించాలన్న అమికస్ క్యూరీ.. సాక్షుల విచారణకు ప్రత్యేక కోర్టులు భద్రమైన గది ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కోర్టులో ఒక వీడియో కాన్ఫరెన్స్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ కోర్టు ఏర్పాటు వ్యయాన్ని కేంద్రం భరించాలన్నారు.