Cancer awareness programs in Telangana:
కర్ణాటకలో అధికారికంగా నమోదైన క్యాన్సర్ బాధితుల సంఖ్య లక్షకు చేరువ అయినట్లు కిద్వాయ్ ఆస్పత్రి నివేదిక వెల్లడిస్తోంది. నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణ విధానాలు, చికిత్సలు, జాగృతి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం.
మహిళలే ఎక్కువ: రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో బెంగళూరు, బెళగావి ముందంజలో ఉన్నాయి. 2021-22 ఏడాది పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ (పీబీసీఆర్)-కర్ణాటక నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 92,891 మంది క్యాన్సర్ చికిత్సల కోసం ఆస్పత్రుల్లో నమోదయ్యారు. వీరిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ. 52,130 మంది మహిళలు వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడ్డారు. జిల్లాల వారీగా బెళగావిలో అత్యధికులు క్యాన్సర్ కోరల్లో చిక్కుకున్నారు. పొగాకు, గుట్కాల కారణంగా ఈ జిల్లావాసులు ఎక్కువగా క్యాన్సర్లతో మరణాలను ఆహ్వానిస్తున్నారని కిద్వాయ్ క్యాన్సర్ నమోదు నివేదిక వెల్లడించింది. 2021-22 ఏడాదిలో మొత్తం 18,100 మంది బెంగళూరు నగవాసులు, 7,801 మంది బెళగావి జిల్లావాసులు క్యాన్సర్ బారినపడ్డారు. మైసూరులో 4,500, బళ్లారిలో 4,200, విజయపురలో 3,890, కలబురగిలో 3,901, తుమకూరులో 3,802, బీదర్, రాయచూరు, ధార్వాడ తదితర జిల్లాల్లో 3వేలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.
ఊపిరితిత్తులపై దాడి: రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్లలో అత్యధికంగా ఊపిరితిత్తులకు సంబంధించినవని పీబీసీఆర్ నివేదిక ద్వారా వెల్లడైంది. గతేడాది మొత్తం 4,301 మంది ఊపిరిత్తుల క్యాన్సర్‌తో బాధపడ్డారు. ఆపై వీర్యగ్రంధి, జీర్ణాశయం, నోరు, గర్భాశయం, రొమ్ము క్యాన్సర్లతో ఆస్పత్రుల్లో చేరారు. పురుషులు అత్యధికంగా వీర్యగ్రంధి, నోటి క్యాన్సర్ల బారిన పడగా, మహిళలకు గర్భాశయం, రొమ్ము, ఇతర క్యాన్సర్ల కారణంగా ఆస్పత్రుల్లో చేరారు. ముందుగా లక్షణాలు కనిపించకుండా నేరుగా మూడో దశకు చేరుకున్న వ్యాధికి సంబంధించి పెద్దపేగు, రొమ్ము, గర్భాశయ సమస్యలు ప్రాణాపాయంగా పరిణమించినట్లు కిద్వాయ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బెళగావి జిల్లాలో ఎక్కువగా నోటి క్యాన్సర్‌తో 80 శాతం మంది మరణించగా, బెంగళూరు, మైసూరు, బళ్లారి, తుమకూరు జిల్లాలో 50శాతం మంది 2021-22 ఏడాదిలో వరుసగా ఊపిరితిత్తులకు సోకిన సమస్యతో మరణించారు.
ఊబకాయం సమస్య: మారుతున్న జీవనశైలి చిన్న వయసులోనే ఊబకాయంతో బాధపడే పరిస్థితులను ఆహ్వానిస్తోందని బెంగళూరులోని కృత్రిమ మేధస్సు ఆధారిత ఆరోగ్య పరీక్షల కేంద్రం-నూరా నివేదిక వెల్లడిస్తోంది. ఊబకాయం అంటే గుండె, మధుమేహం, కొవ్వు సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని మాత్రమే తెలుసు. ఇటీవలి కాలంలో ఈ అధిక శరీరం లోపల క్యాన్సర్‌కు దారి తీసే కారకాలు వృద్ధి అవుతున్నట్లు ఈ సంస్థ వెల్లడిస్తోంది. ఊబకాయం కారణంగా 13 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉండగా, సాధారణ శరీరం ఉన్నవారి కంటే నాలుగు రెట్ల అధికంగా క్యాన్సర్లు ఊబకాయులకు వచ్చే వీలుందని ఈ సంస్థ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తౌసిఫ్ అహ్మద్ తంగల్వాడి చెప్పారు. ఊబకాయంతో ఏడు శాతం జీర్ణాశయ క్యాన్సర్లు, 1.5 రెట్ల రొమ్ము, 1.1 రెట్లు అధికంగా అండాశయ క్యాన్సర్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఊబకాయం ద్వారా వృద్ధి చెందే ఇక్కట్లు ముందుగా లక్షణాలు కనిపించకపోవటం ఆందోళన కల్గించే అంశం. ఈ జీవనశైలి యువకులను కూడా క్యాన్సర్ బారినపడేలా చేస్తోంది. రియల్ టైమ్, ఏఐ ఆధారిత ఫిట్ కిట్, సీఏ 19-9, ట్యూమ్ మార్కర్ వంటి ఆధునిక విధానాలు త్వరగా, స్పష్టంగా క్యాన్సర్‌ను గుర్తించే వీలుంది.
జాగృతి కార్యక్రమాలు:
- రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హుబ్బళ్లిలోని కర్ణాటక క్యాన్సర్ థెరపీ రీసెర్చ్ సంస్థకు ఆయుష్మాన్ కార్డు సదుపాయం కల్పించింది. ఇదే సంస్థ ప్రకృతి, ఆయర్వేద చికిత్స విధానాలను క్యాన్సర్ కోసం తయారు చేస్తోంది.
- క్యాన్సర్ నియంత్రణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు విస్తృత స్థాయిలో జాగృతి కల్పిస్తున్నాయి. ఇటీవల కర్ణాటక క్యాన్సర్ సొసైటీ బీపీఎల్ మహిళలకు 40శాతం రాయితీతో శస్త్ర చికిత్స, కీమో థెరపీలు చేయిస్తామని ప్రకటించింది. ఎంపిక చేసిన జిల్లాల్లో క్యాన్సర్ రోగులకు ఉచిత ఔషధాలు అందిస్తోంది.
- ఐఐఎస్‌సీ బ్రెయిన్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక చికిత్స విధానాన్ని ఆవిష్కరించింది. జీవ కణాలతో మెదడు క్యాన్సర్‌ను ఔషధాలతోనే నియంత్రించే గ్లియోబ్లాస్టోమా విధానాన్ని కనుగొంది.
- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరానికి చెందిన హెచ్‌సీజీ క్యాన్సర్ సెంటర్ 23 విశిష్ట కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ‘బాల్డ్ అండ్ బోల్డ్’ అభియాన్ ద్వారా స్టాండ్స్ ఆఫ్ హోప్ (బాధితుల ఆశయం) ఔత్సాహికులు తమ కేశాలను క్యాన్సర్ బాధితులకు వితరణ చేశారు. ఇదే సందర్భంగా నిరంతర పరీక్షలు, జీవనశైలి మార్పుల కోసం ‘వాకథాన్’, వ్యక్తిగత చికిత్సల కోసం జీవ కణాల సేకరణ, జీవకణాల బ్యాంకింగ్, క్యాన్సర్ రిజిస్ట్రీ, డేటా అనాలసిస్ వ్యవస్థలపై అవగాహన కల్పించారు. పద్మభూషణ్ డాక్టర్ జి.పద్మనాభన్, డాక్టర్ విశాల్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇవీ చదవండి: