రైతుబంధు పథకం కింద సొమ్ము పంపిణీ చేయాల్సిన రైతుల జాబితాలను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. ఈ పథకాన్ని 2018 వానాకాలం(ఖరీఫ్) సీజన్ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. తొలిసారి ఎకరానికి రూ.4 వేలు ఇచ్చింది. 2019 వానాకాలం నుంచి ఎకరానికి రూ.5 వేలు రైతు బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. 2018-21 మార్చి వరకూ 6 పంట సీజన్లకు మొత్తం రూ.35,911 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఈ ఏడాది(2021-22)లో వానాకాలం, యాసంగి(రబీ) సీజన్లలో కలిపి మొత్తం రూ.14,800 కోట్లు ఇస్తామని బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. గత యాసంగిలో 59,25,725 మంది రైతుల ఖాతాల్లో రూ.7,400 కోట్లను వ్యవసాయశాఖ జమ చేసింది. ఇప్పుడు రైతుల సంఖ్య 60 లక్షలకు చేరవచ్చని ప్రాథమిక అంచనా. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటిదాకా లక్షన్నర మంది భూముల యజమానులు రైతుబంధు నిధులు తీసుకోవడం లేదు. ఈ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి. లక్షన్నర మంది దాకా ఇవ్వడం లేదు. ఈ సీజన్‌లో ప్రతీ రైతు నుంచి మళ్లీ వివరాలు సేకరించాలని గ్రామ స్థాయిలో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారులకు(ఏఈవోలకు) వ్యవసాయశాఖ సూచించింది. కొత్త రైతులు తోడయితే ఈ పథకం కింద అందజేయాల్సిన మొత్తం పెరుగుతుంది. అలాగే భూ విక్రయాల తర్వాత యజమానుల పేర్లు మారాల్సి ఉంటుంది. ఈ రకంగా 2021 జనవరి నుంచి జూన్ 10 వరకూ భూ యజమాన్య పత్రాల్లో పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ జాబితాలోకి మారిన రైతుల పేర్లను కూడా సేకరిస్తారు. వివరాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ తాజాగా రెవెన్యూ శాఖను అడిగింది.
జూన్ 15 నుంచి 25లోగా...
రైతుల తాజా జాబితాలను రెవెన్యూశాఖ నుంచి తీసుకుని జూన్ 10కల్లా జాతీయ సమాచార కేంద్రానికి(ఎన్‌ఐసీకి) వ్యవసాయశాఖ అందజేస్తుంది. ఎకరంలోపు రైతులు, 2 ఎకరాల్లోపు ఉన్నవారు, 3 ఎకరాల్లోపు ఉన్నవారు...ఇలా భూమి విస్తీర్ణం వారీగా రైతుల జాబితాలను సిద్ధం చేస్తారు. 11వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా నిధుల జమకు ఏర్పాట్లు చేస్తారు. జూన్ 15 నుంచి 25లోగా ఒక్కోరోజు లక్షల మందికి జమ చేస్తారు. నిధుల లభ్యతను బట్టి ఏ రోజు ఎంత మందికి వేయాలనేది ఆర్థికశాఖ నిర్ణయిస్తుంది.
గత యాసంగిలో నల్గొండకు అత్యధికంగా రూ.596 కోట్లు
రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా నల్గొండ జిల్లాలో 11.92 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. గత యాసంగిలో ఈ జిల్లాకు అత్యధికంగా రూ.596 కోట్లు, అత్యల్పంగా మేడ్చల్‌కు రూ.33.11 కోట్లు పంపిణీ చేశారు. కిందటి యాసంగిలో 2020 డిసెంబరు నుంచి జనవరి దాకా ఈ పథకం కింద ఏయే రైతుల ఖాతాల్లో సొమ్ము వేశారో వారందరికీ ఇప్పుడు మళ్లీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖను తాజాగా ఆదేశించింది. గతేడాది వానాకాలంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి మొత్తం కోటీ 45 లక్షల ఎకరాల్లో పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. కానీ రైతుబంధు మాత్రం కోటీ 47 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాల్లో సొమ్ము వేశారు. దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఎలాంటి పంటలు వేయకున్నా సొమ్ము ఇస్తున్నారు.
మీ బ్యాంకు వేరే బ్యాంకులో విలీనమైతే ఇలా చేయండి
దేశవ్యాప్తంగా బ్యాంకుల విలీనం కారణంగా కొన్నింటి పేర్లు మారిపోయాయి. ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇతర బ్యాంకుల్లో విలీనమయ్యాయి. ఈ బ్యాంకుల్లో గతంలో ఖాతాలు కలిగిన రైతులు ప్రస్తుతం అవి ఏ బ్యాంకు పేరుతో ఉన్నాయో ఆ వివరాలను జూన్ 10కల్లా వారి మండల వ్యవసాయాధికారికి(ఏవోకు) లేదా ఏఈవోకు అందజేయాలి. ఆధార్ కార్డు, కొత్త బ్యాంకు పాసుబుక్, భూమి పాసుపుస్తకం జిరాక్స్ కాపీలు సమర్పించాలి. ఇవ్వకపోతే వారికి రైతుబంధు సొమ్ము జమకాదని వ్యవసాయశాఖ తెలిపింది.
ఇదీ చదవండి: Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు