కొత్త రేషన్ కార్డుల(Ration Cards) జారీ విధివిధానాలు, ప్రజాపంపిణీ, రేషన్ డీలర్ల కమీషన్ పెంపు పౌరసరఫరాల సంబంధిత అంశాలపై మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉపసంఘం తొలి సమావేశం ఈనెల 14న జరగనున్నట్లు గంగుల తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ విధివిధానాలు, జనాభా ప్రాతిపదికన రేషన్ షాపుల ఏర్పాటు, ప్రజలకు సులభంగా రేషన్ అందేలా ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్ఠం కోసం తీసుకోవాల్సిన చర్యలు, రేషన్ డీలర్ల సమస్యలు, కమీషన్ పెంపు తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చిస్తామని మంత్రి చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన విధంగా పౌరసరఫరాల వ్యవస్థను తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే జాతీయ ఆహార భద్రత కింద 53,55,797 కార్డులకు గాను 1,91,69,619 మంది లబ్ధిదారులు ఉన్నారని... అదనంగా రాష్ట్రం ఇచ్చిన 33,85,779 కార్డుల ద్వారా 87,54,681 మంది రేషన్ పొందుతున్నారని గంగుల తెలిపారు. 4,46,169 కార్డుల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం 1,78,043 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా ఇస్తుండగా జూన్ మాసంలో అదనంగా 2,52,864 మెట్రిక్ టన్నుల్ని లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: petrol price: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు