ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ద్వితీయ ఇంటర్ పరీక్షలు జరిగే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 1న సమీక్షించి కరోనా పరిస్థితులను బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అప్పటికి కరోనా తగ్గే అవకాశం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరీ ఆలస్యమైతే మళ్లీ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వైద్య విద్యతో పాటు ఎన్‌ఐటీలు, ఐఐటీలు తదితరాల్లో ప్రవేశాలకు సమస్య అవుతుంది.
జవాబుపత్రాల మూల్యాంకనానికి ప్రైవేట్ అధ్యాపకుల వెనకడుగు కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుంది. అంతేకాక ఈ విద్యా సంవత్సరంలో 20-25 రోజులే ప్రత్యక్ష తరగతులు జరిగినందున పరీక్షల నిర్వహణ కూడా సమంజసం కాదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్‌బోర్డు అధికారులు సైతం పరీక్షలు జరగకపోతే ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఏ ప్రాతిపదికన మార్కులు ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నారు. తొలి ఏడాది మార్కుల ఆధారంగా ఇవ్వటమే తగిన ప్రత్యామ్నాయమన్న ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ తమకు మార్కులు సరిపోవనుకున్న వారికి.. తదనంతరం పరీక్షలు జరిపినప్పుడు మళ్లీ రాసుకునే ఐచ్ఛికం కూడా ఇస్తారు.
ప్రయోగ పరీక్షలూ లేనట్లే
విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు సైతం జరిగేలా లేవు. అలాంటప్పుడు విద్యార్థులు రాసే సైన్స్ రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు కేటాయించాలని ఇంటర్‌బోర్డు భావిస్తోంది.
ఫీజులకు ముడిపెట్టొద్దు
ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులు పంపిన నైతిక, మానవీయ విలువలు; పర్యావరణ విద్య అసైన్‌మెంట్ జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి మార్కులను మే 3వ తేదీలోపు ఇంటర్‌బోర్డుకు పంపాలని బోర్డు కార్యదర్శి జలీల్ కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. ఫీజులకు, మార్కులకు ముడిపెట్టవద్దని హెచ్చరించారు. రుసుములు చెల్లించనందున అసైన్‌మెంట్లను తీసుకోవడం లేదని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి: 1నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ప్రమోట్