Sankranti festival Rush సంక్రాంతికి సొంతూరు వెళ్లేందుకు భాగ్యనగరవాసులు తరలివెళ్తున్నారు. విద్యాసంస్థలకు వారం రోజుల సెలవులు రావడంతో పండగ జరుపుకునేందుకు స్వగ్రామాలకు తరలిపోతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరక్క పండక్కి వెళ్లేవారు పిల్లాపాపలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Sankranti festival effect తెలుగువారికి అతిపెద్ద పండగల్లో ఒకటైన సంక్రాంతిని స్వగ్రామంలో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి, నాంపల్లి రైల్వేస్టేషన్లు సుదూర ప్రాంతాలకు వెళ్లేవారితో రద్దీగా మారాయి. ఒకేసారి వేలాది మంది ప్రయాణాలకు సిద్ధమవడంతో రైళ్లు పూర్తిగా నిండిపోతున్నాయి. పిల్లలతో కలిసి ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. రైళ్లలో ఏసీ, స్లీపర్ క్లాసులు పూర్తిగా నిండిపోగా.. జనరల్ బోగీల్లోనూ సీట్లు దొరక్కపోయినా నిలబడి మరీ వెళ్తున్నారు. ప్రత్యేక రైళ్లు వారం, పది రోజుల ముందే పూర్తిగా నిండిపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంగణమంతా వేలాదిమందితో కిటకిటలాడుతోంది.
Sankranti festival Rush 2023 ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్ బస్టాండ్లు సహా ఎల్బీనగర్ , ఉప్పల్ , కొంపల్లి, కూకకట్ పల్లి, ఆరాంఘర్ ప్రయాణ ప్రాంగణాలన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నా... పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. విద్యాసంస్థలకు సెలవుల ప్రకటనతో... జనమంతా ఒక్కసారే స్వస్థలాలకి వెళ్లేందుకు రావడంతో ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ నెలకొంది. చాలాచోట్ల బస్సుల్లో సీట్ల కోసం నిరీక్షిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి 4వేల 233 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అవి ప్రజల అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు.
హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్తున్న ప్రయాణికులు, వాహనాలతో టోల్ గేట్ల వద్ద రద్దీ నెలకొంది. వేలాదివాహనాల రాకతో ఫాస్టాగ్ ఉన్నా ఆలస్యమవుతోంది. విజయవాడ జాతీయ రహదారిలో పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరి కనిపించాయి. వరంగల్ హైవేపైనున్న టోల్ గేట్ల వద్ద రద్దీ నెలకొంది. హనుమకొండ, వరంగల్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. సొంతూర్లకు వెళ్లేందుకు వచ్చిన విద్యార్థులతో సందడిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
ఇవీ చూడండి: