Mayawati Hyderabad Tour : సుదీర్ఘ విరామం తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి హైదరాబాద్ నగరానికి వచ్చారు. ప్రస్తుతం కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆమె.. బెంగళూరు నుంచి ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటుగా బీఎస్‌పీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జీ, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్, రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ మంద ప్రభాకర్, చంద్రశేఖర్ ముదిరాజ్ తదితర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయానికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాయావతి రాక కోసం ఎదురు చూశారు. మాయవతి కారులో వారికి అభివాదం చేసుకుంటూ.. రోడ్డు మార్గం ద్వారా బంజారాహిల్స్‌లోని పార్కు హయాత్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ఆ పార్టీ నేతలతో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమాల వివరాలపై ఆరా తీశారు. ఆదివారం సాయంత్రం సరూర్‌నగర్ మైదానంలో చేపట్టిన తెలంగాణ భరోసా యాత్ర నిర్వహణ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ పార్టీ కార్యచరణను నేతలతో కలిసి చర్చించారు.
BSP meeting in Hyderabad: రాష్ట్రంలో నిరుద్యోగం, రైతాంగం సమస్యలు, అసమానతలు, అణిచివేతల పాలన నుంచి విముక్తి కోరుతూ చేపట్టిన తెలంగాణ భరోసా సభ ద్వారా మాయామతి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వనున్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో బీఎస్‌పీ సంస్థాగతంగా బలోపేతం దిశగా వేస్తున్న అడుగుల్లో భాగంగా తెలంగాణ భరోసా సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బీఎస్‌పీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఏర్పాట్లు పూర్తి: హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఆదివారం జరిగే బీఎస్పీ తెలంగాణ భరోసా యాత్ర సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు లక్ష మంది వచ్చే విధంగా ఆ పార్టీ చర్యలు తీసుకొంది. ఆ బాధ్యతను జిల్లాల వారీగా నాయకులకు అప్పగించింది. నగరంలో మాయావతి రాక, బహిరంగ సభ సందర్భంగా బ్యానర్లు, హోర్డింగ్‌లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. రేపటి తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి:
Green India Challenge : 'ప్రకృతి లయ తప్పడంతోనే ఈ అకాల వర్షాలు'
'మౌనమే అంగీకారమా?.. విచారణ ఎందుకు ఇంత నత్తనడకన సాగుతోంది?'
TSPSC పేపర్ లీక్ పెద్ద స్కామ్.. ఇందులో వారి హస్తం ఉంది: వైఎస్ షర్మిల