Free electricity controversy Telangana : 'ధరణి పోవాలే.. దళారులు రావాలి' అనేది కాంగ్రెస్ పార్టీ అభిమతంగా మారిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. సొమాజిగూడాలోని విద్యుత్ సౌధ ముందు ఎమ్మెల్సీ కవిత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నేతలు బైఠాయించారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
BRS protest over Revanth Reddy comments : కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను పురికొల్పుతోందని.. ఆ పార్టీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ బోగస్ అని అర్థమవుతోందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ సర్కార్.. వెన్నంటి ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తోందని పేర్కొన్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో.. తెలంగాణ సస్యశ్యామలంగా మారిందదని తెలిపారు. చక్కని రైతు విధానాలతో తెలంగాణ దేశంలో ఆదర్శంగా నిలిచిందని.. గతంలో సాగులో 15వ స్థానంలో తెలంగాణ.. నేడు పంజాబ్ తర్వాత దేశంలో రెండో స్థానానికి ఎదిగిందని వెల్లడించారు. పంట పెట్టుబడిసాయం రైతుబంధు.. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచిందని.. మిగతా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పారు.
KTR Tweet Today : '3 పంటలా.. 3 గంటలా.. మతం పేరిట మంటలా.. ఏం కావాలో రైతులే తేల్చుకోవాలి'
రైతుకు సాగు పండుగ కావాలంటే కరెంట్ కోతలు లేని.. నాణ్యమైన విద్యుత్ కావాలని కవిత అన్నారు. రాష్ట్రంలో 27.5 లక్షల మంది బోర్ల ద్వారా సాగు చేస్తున్నారని.. ఇది చూసి కూడా రైతులకు 24 గంటల విద్యుత్ ఎందుకని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఆగ్రహిస్తే ఎవరూ అధికారంలోకి రాలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ.. రైతు వ్యతిరేక విధానాలను అందరూ ఖండించాలని.. రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ పార్టీ రైతులకు పూర్తి అండగా నిలుస్తుందన్నారు.
అసలు స్వరూపం బయటపడింది.. రైతులు, వ్యవసాయం పట్ల రేవంత్ రెడ్డి అసలు స్వరూపం ఏంటో అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యల్లోనే బైటపడిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులతో పెట్టుకున్న వారెవరికైనా పుట్టగతులుండవన్నారు. మహబూబ్ నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రైతుధర్నాలో మంత్రి పాల్గొన్నారు. రేవంత్ అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఆదిలాబాద్‌లోని విద్యుత్తు ఎస్ఈ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. హనుమకొండ జిల్లా పరకాల, నడికూడలోనూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెద్దపీట వేస్తూ 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తుంటే ఓర్వలేక రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు.
ఇవీ చదవండి: