BRS protest against Gas price hike : పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద మంత్రి తలసాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు.
BRS protest across telangana against Gas price hike : మరోవైపు ట్యాంక్‌బండ్ దగ్గర ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. పార్టీ నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. సిలిండర్‌తోపాటు కట్టెల మోపులతో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మరోవైపు కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు.
BRS Dharna against Gas price hike : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను నిరసిస్తూ కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ వంటా వార్పు కార్యక్రమం చేపట్టింది. పెద్ద ఎత్తన పాల్గొన్న మహిళలు తరచూ సిలిండర్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారంటూ కేంద్ర సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన ఈ ఆందోళనల్లో... పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్‌లో గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని కేంద్రంపై హరీశ్ రావు మండిపడ్డారు. యూపీఏ హయాంలో గ్యాస్‌పై రూ.2.14లక్షల సబ్సిడీ ఇచ్చేదని.. గ్యాస్‌పై సబ్సిడీని బీజేపీ పూర్తిగా ఎత్తివేసిందని మండిపడ్డారు.
"గతంలో గ్యాస్ ధర రూ.400 ఉంటే బీజేపీ గగ్గోలు పెట్టింది. ఉపాధి హామీ పథకంలో రూ.30 వేల కోట్లు కోత పెట్టారు. పీఎం కిసాన్ యోజనలో భారీగా లబ్ధిదారులను తగ్గించారు. సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి బీజేపీ పేదల నడ్డి విరిస్తోంది. ఎన్నికల తరువాత గ్యాస్ ధరలు పెంచడం అనవాయితీగా మారింది. ఎన్నికలు రాగానే గ్యాస్‌పై 10 పైసలు తగ్గిస్తారు. ఎన్నికలు అయిపోగానే గ్యాస్‌పై రూ.100 పెంచుతున్నారు. బీజేపీ అంటే.. భారత జనులను పీడించే పార్టీ. నిండా ముంచిన బీజేపీని ముంచాలని ప్రజలు చూస్తున్నారు. అన్ని వర్గాలను బీజేపీ మోసం చేసింది." - హరీశ్ రావు, రాష్ట్ర మంత్రి