BRS MLC'S NOMINATION: శాసనమండలికి ఎమ్మెల్యేల కోటా బీఆర్ఎస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు వేశారు. దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. కేసీఆర్ సూచనల మేరకు ఈ ఉదయం 11 గంటలకు నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు వేశారు. అభ్యర్థుల నామినేషన్లుకు మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. నామినేషన్లు వేయడానికి ముందు అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థులు నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌లు నివాళులు అర్పించారు.
ఈ ఏడాదితో శాసనమండలిలో గాంగాధర్ గౌడ్, నవీన్ కుమార్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం ముగుస్తుండడంతో.. వీరి కోటాలో అనగా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికకు ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి మార్చి 13 వరకు ఈ ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించునున్నారు. ఈ స్వీకరించిన నామినేషన్లను 14వ తేదీన పరిశీలించనున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఈ నెల 16వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఉపసంహరించుకున్న నామినేషన్ల తర్వాత వారం రోజుల సమయంలో మార్చి 23 న ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఓట్ల లెక్కించనున్నారు.
అభ్యర్థుల వివరాలు: నవీన్ కుమార్‌కు కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. గతంలో టీచర్‌గా చేసి ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించి సీఎం కార్యాలయం ఓఎస్‌డీగా చేసిన కవి దేశపతి శ్రీనివాస్‌కు కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. మొదటి నుంచి దేశపతికి ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ.. పలు కారణాల వల్ల అవకాశం ఇవ్వలేక పోయారు.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు, చల్లా వెంకట్రామిరెడ్డి ఇటీవలే బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ విస్తరణలో చల్లా వెంకట్రామిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్, భిక్షమయ్య గౌడ్ మొదలైన వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరిగింది. చివరికీ అధిష్ఠానం వారికి అవకాశం కల్పించలేదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ పదవీ కాలం ముగియనుండటంతో.. ఆ స్థానంలో ఇద్దరి పేర్లను ఇవాళ కేబినెట్ సమావేశం ఖరారు చేయనుంది. గతంలో పాడి కౌశిక్ రెడ్డి పేరును కేబినెట్ సిఫార్సు చేసినప్పుడు.. గవర్నర్ ఆమోదించనందున.. బీఆర్ఎస్ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి: