BRS Campaign For Telangana Assembly Elections 2023 : అధికారమే లక్ష్యంగా.. సంక్షేమమే నినాదంగా బీఆర్ఎస్ ప్రజల్లోకి దూసుకెళ్తుంది. ఇప్పటికే అధికారంలో ఉన్న కారు సర్కారు.. గేరు మార్చి స్పీడు పెంచింది. వినూత్న రీతిలో ప్రచారాలను చేపడుతుంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని.. భవిష్యత్ లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మంత్రి మల్లారెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. శామీర్‌పేట్ మండలం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో సోమవారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు.
BRS Campaign in Telangana 2023 : మాయమాటలు చెప్పే రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచి కూకట్‌పల్లిలో ఏ ఒక్క డివిజన్‌లోనైనా పర్యటించారా? అని బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు అన్నారు. అలాంటి వారు గెలిస్తే రాష్ట్రం ఆగమవుతుందని విమర్శించారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో కోల శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 500మంది యువత, పలువురు జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి.. అరికెపూడి గాంధీని మరోమారు గెలిపించాలంటూ కార్పొరేటర్లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
'ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు'
తార్నాక డివిజన్‌లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు గౌడ్ స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలకు బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ కుల గణన వివరాలు బయటపెట్టే దమ్ము ధైర్యం కాంగ్రెస్, బీజేపీలకు ఉందా అని ప్రశ్నించారు. బీసీ కుల గణన, బీసీ రిజర్వేషన్ల పై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిర్మల్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ప్రచార జోరుందుకుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై అభిమానంతో వడ్యాల గ్రామానికి చెందిన ఓ మాజీ సైనిక ఉద్యోగి నామినేషన్ కోసం 30వేల 939 రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. బీఆర్ఎస్ అంటేనే ప్రజా సంక్షేమమని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జోరుగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
Telangana Assembly Elections Campaign 2023 : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఖానాపురం మండలంలో ప్రచారం నిర్వహించగా.. పలు గ్రామాల ప్రజలు డప్పు వాయిద్యాలు, బతుకమ్మలు, మోటార్ సైకిల్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఎన్నికల ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడుతూ విస్తృత ప్రచారం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
'ఓటర్లు పరిణితితో ఓటేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది - సరిగ్గా వాడితే మంచి భవిష్యత్ ఉంటుంది'
'' ఎన్నికల వేళ ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపెడుతున్న పార్టీలను చూస్తే నవ్వువస్తుంది. ఒక రకంగా జాలి కలుగుతుంది. ఎన్నికలు రాగానే బీసీలపై ప్రేమ పుట్టుకొస్తుంది. బీసీ కుల గణన వివరాలు బయటపెట్టే దమ్ము ధైర్యం కాంగ్రెస్, బీజేపీలకు ఉందా.. బీసీ కుల గణన, బీసీ రిజర్వేషన్ల పై బీజేపీ సమాధానం చెప్పాలి.''-ఎమ్మెల్సీ కవిత
మునుగోడులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైఖరికి నిరసనగా.. చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు పార్టీకి రాజీనామా చేశారు. దేశానికి రాష్ట్రం ఆదర్శంగా మారిందని.. కేసీఆర్ ప్రజలను కంటికి రెప్ప లా కాపడుకుంటున్నరని ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోకార్యకర్తలు , మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీగా ర్యాలీలను నిర్వహిస్తూ.. సీఎం కేసీఆర్ మద్దతు పలుకుతున్నారు.