ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ వసతి గృహంలో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న చిన్నారి ఆదిత్య... రక్తపు మడుగులో శవంగా తేలాడు. హాస్టల్లోని బాత్‌రూమ్ సమీపంలో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆదిత్య మెడపై.. కత్తితో కోసినట్లు గాయముంది. అతడి మృతదేహాన్ని హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు గమనించిన వెంటనే.. పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఆదిత్యతో కలిసి బాత్రూమ్కు వెళ్లిన ఓ సహచర విద్యార్థి.. తిరిగి ఆదిత్య తనతోపాటు గదిలోకి రాలేదని చెప్పినట్టు హాస్టల్ సిబ్బంది తెలిపారు.
ఈ మధ్యలో ఏం జరిగింది.. అసలు ఆదిత్య ఎలా చనిపోయాడన్నదీ తేల్చే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడపై ఉన్న గాయాన్ని కీలకంగా భావిస్తున్నారు. తోటి విద్యార్థుల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? బయటి వ్యక్తులు ఈ పని చేశారా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. మచిలీపట్నం నుంచి జాగిలాలను, క్లూస్ బృందాలను రంగంలోకి దించారు. మూడో తరగతి విద్యార్థులకు వసతి ఉన్న మొదటి అంతస్తును, ఆదిత్య చనిపోయిన స్థలాన్ని, పరిసరాలను పరిశీలించారు.
రెండు వసతి గృహాలకు ఒకే వార్డెన్
చల్లపల్లి, మోపిదేవికి ఒకే వార్డెన్ ఉంటున్నారు. సోమవారం చల్లపల్లిలో కాకుండా.. తనకు ఇన్‌ఛార్జి బాధ్యతలు ఉన్న మోపిదేవి వసతి గృహానికి వెళ్లారు. తన సహాయకుని ద్వారా జరిగిన ఘటన గురించి తెలుసుకుని హాస్టల్‌కు చేరుకున్నారు. విద్యార్ధులతో మాట్లాడారు. మరోవైపు.. తమకు ఒక్కగానొక్క కుమారుడని.. ఎవరితో తగాదాలు లేవని ఆదిత్య తల్లిదండ్రులు రవీంద్ర, రాజ్యలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు.
ఇవి కూడా చదవండి: